హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్సీలో సీట్ల పెంపునకు అనుమతించాలంటూ గతంలో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు కోర్టు ధికరణ వ్యాజ్యాలను దాఖలు చేశాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని అధికారులకు నోటీసులు జారీచేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిన తర్వాత కూడా ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆదేశించింది. దీనిని కోర్టు ధికరణగా ఎందుకు పరిగణించరాదో వివరించాలని కోరింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యా కమిషనర్ ఏ శ్రీదేవసేన, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, టీజీ ఈఏపీసెట్ కన్వీనర్ డాక్టర్ బీ డీన్‌కుమార్‌కు నోటీసులు జారీచేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.