హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): పెత్తందారులకు కాంగ్రెస్ నేతలు వారసులైతే, తాము తిరగబడే వారికి వారసులం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తెలిపారు. గ్రామసభల్లో ప్రభుత్వంపై ప్రజలు ఎకడికకడ తిరగబడుతున్నారని తెలిపారు. దానికి బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తే ఉప్పెనలా కదిలి నాలుగేండ్లు కూడా అధికారంలో ఉండలేమన్న భయం కాంగ్రెస్ పాలకుల్లో నెలకొన్నదని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం మంచిరేవులలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ నేతలు కోటిరెడ్డి, విజయ్‌కుమార్‌తో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి కాంగ్రెస్ నేతలను పంపి బీఆర్ఎస్ నేతలపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు.
ఇష్టారాజ్యం పోలీస్ రాజ్యం అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దళారుల నుంచి మంత్రి కోమటిరెడ్డి రూ.500 కోట్ల లంచం తీసుకొని రైతులకు రూ.1,000 కోట్లకుపైగా నష్టం చేశారని విమర్శించారు. నష్టపోయిన రైతులు నల్లగొండ వేదికగా సత్తా చూపుతారని హెచ్చరించారు. నల్లగొండలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతించిందని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అనుమతిచ్చిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.