హైదరాబాద్, అక్టోబర్ 3, (నమస్తే తెలంగాణ): లైంగికదాడి కేసులో ఓ నిందితుడికి నాంపల్లి కోర్టు విధించిన జైలుశిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఓ వ్యక్తి గోప్యంగా చెప్పిన సాక్ష్యానికి ఆధారాలు, అభియోగాలకు సంబంధించి వైద్య నివేదికలు లేవని తేల్చింది. విశ్వసనీయ సాక్ష్యానికి కూడా ఆధారాలు ఉండాలని స్పష్టంచేసింది. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన ఇర్ఫాన్ఖాన్పై నమోదైన లైంగికదాడి కేసును కొట్టివేసింది.
నాంపల్లి కోర్టు విధించిన పదేండ్ల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానాను రద్దు చేసింది. తన ప్రియుడు ఇర్ఫాన్‌ఖాన్ ఇంటికి వచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2008 నవంబర్‌లో తనపై లైంగికదాడి జరిగిందని 2009లో ఫిర్యాదు చేయడం, ఆలస్యానికి కారణాలు పేర్కొనకపోవడం, ఆధారాలు లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.