హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోరాదని ఎస్పీడీసీఎల్ను హైకోర్టు ఇటీవల ఆదేశించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా నాన్‌లోకల్‌గా పరిగణించి నియామకాలు చేపట్టరాదని తెలిపింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా తనను స్థానికేతర కోటా కింద అభ్యర్థిగా పరిగణించడాన్ని సవాలు చేస్తూ కామారెడ్డి జిల్లాకు చెందిన టీ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ టీ మాధవీదేవి విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ నిమిత్తం 2019లో జారీ అయిన నోటిఫికేషన్ ఆధారంగా చేపట్టే నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయంటూ 2021లో ఎస్పీడీసీఎల్ జనరల్ మేనేజర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారని తెలిపారు.
ఈ ప్రొసీడింగ్స్ రాష్ట్రపతి ఉత్తర్వులకు, ప్రభుత్వం 2018లో జారీచేసిన 124, 132 జీవోలకు విరుద్ధమని అన్నారు. పిటిషనర్‌కు 56 మారులు వచ్చాయని, 18వ ర్యాంకు సాధించారని చెప్పారు. అయినప్పటికీ స్థానికేతరుడిగా ఐదు శాతం కోటా కింద పరిగణనలోకి తీసుకుందని అన్నారు. ఎస్పీడీసీఎల్కు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవంటూ గతంలో ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పు పిటిషనర్‌కు కూడా వర్తిస్తుందని పేరొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్ మెరిట్ ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్పీడీసీఎల్కు ఉత్తర్వులు జారీచేశారు.
వివిధ పోస్టుల భర్తీ వ్యవహారంలో స్థానికత వివాదంపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాఖలు చేసిన అప్పీళ్లపై ధర్మాసనం ఈ నెల 26న విచారణ చేపట్టనుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 124లో స్థానిక నిబంధనల పరిగణనలో కొన్ని లోపాలున్నప్పటికీ ఎంపికైన అభ్యర్థులను స్థానికులుగా పరిగణనలోకి తీసుకోవాలంటూ వివిధ పిటిషన్లలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే.