High Court | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): లగచర్లలో పచ్చని భూములను చెరబట్టాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పేద రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. దాష్టీకానికి పాల్పడగా, బాధితులకు న్యాయస్థానం అండగా నిలిచింది. ‘మా భూములు మాకేనంటూ..’ ప్రభుత్వంపై తిరగబడ్డ రైతులపక్షాన న్యాయం ఉన్నదంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణను నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్యసవరంగా భూములు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ కొనసాగించవద్దని ఆదేశించింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో 351.10 ఎకరాలు,లగచర్లలో 110.32 ఎకరాల భూసేకరణ నిమిత్తం 2024 నవంబర్‌లో జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్ల అమలును నిలిపివేస్తూ స్టే విధించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే శ్రీనివాస్‌రావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు.
ఏడాదికి పైగా పోరాటం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, ఫార్మావిలేజ్లను తెరమీదకి తెచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మావిలేజ్ ఏర్పాటుకు గత సంవత్సరం మార్చిలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దుద్యాల మండలంలోని భూములను అధికారులు పరిశీలించారు. దీంతో రైతులు తమ భూములను గుంజుకోవద్దని, ఫార్మా కంపెనీలు కట్టొద్దని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమ భూములు ఇచ్చేదిలేదని బాధిత రైతులు నెలల తరబడి దీక్షలు చేస్తూ, నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మొండిపట్టుదలకు పోయింది. దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంటతండాల పరిధిలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసింది. 1,375 ఎకరాలు సేకరించాలని సరారు నిర్ణయించింది. ఇందులో 600 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా, మిగిలిన 775 ఎకరాల భూమిని రైతుల వద్ద సేకరించాలని నిర్ణయించింది. అక్టోబర్ 25న లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ దుద్యాల మండల అధ్యక్షుడు శేఖర్ వాహనాన్ని రోటిబండతండా వద్ద రైతులు అడ్డుకొని, దాడి చేశారు. ఈ ఘటన తర్వాత కూడా రైతుల వేదనను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. నవంబర్ 11న దుద్యాల-హకీంపేట మధ్య గ్రామసభను ఏర్పాటు చేయగా, రైతులు కలెక్టర్ ప్రతీక్జైన్తోపాటు ఇతర అధికారులను అడ్డుకున్నారు. వాహనాలపై దాడి చేశారు.
అర్ధరాత్రి అరాచకం
ఎన్ని విధాలా ప్రయత్నించినా రైతులు భూములు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కక్ష కట్టింది. కలెక్టర్‌పై దాడి చేశారనే నెపంతో నవంబర్ 12న అర్ధరాత్రి లగచర్ల, రోటిబండతండాలపై వందలాది పోలీసులు విరుచుకుపడ్డారు. కరెంటు సరఫరా నిలిపివేసి, తలుపులు బద్దలు కొట్టి, పదుల సంఖ్యలో రైతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, వృద్ధులపై కూడా దాడి చేశారని స్థానికులు ఆరోపించారు. మొదట 16 మందిని అరెస్టు చేయగా, ఆ తర్వాత దశలవారీగా మరి కొంతమందిని అదుపులోకి తీసుకొని జైల్లో పెట్టారు. అందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఆ రైతులు కేసులను ఎదురొంటూ కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కలెక్టర్‌పై దాడికి సూత్రధారి అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని సైతం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నవంబర్ 12న అర్ధరాత్రి జరిగిన అరాచకంపై లగచర్ల గ్రామస్తులు పోరాటానికి దిగారు. తమకు జరిగిన అన్యాయంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హకుల కమిషన్, ఇతర సంఘాలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ దాష్టీకంతో ఆగమైన రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. వారికి గొంతుకగా మారింది. వారి వేదనను ఢిల్లీ వరకు వినిపించేలా ఆర్థిక, రాజకీయ, న్యాయపరమైన సహాయం చేసింది. అవసరమైతే, దేశంలోనే టాప్ లాయర్లను తీసుకువచ్చి కోర్టుల్లో వాదించి న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అండతో లగచర్ల రైతులు తమ భూముల కోసం, న్యాయం కోసం పోరాటం కొనసాగించారు. చివరికి హైకోర్టు వారికి ఊరట కల్పించింది. వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ చర్యలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
‘అత్యవసరం’ ఏముంది?
దేశ రక్షణ, అత్యవసర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటి అత్యవసర అవసరాల నిమిత్తం భూసేకరణ చేసేందుకు వీలు కల్పించే భూసేకరణ చట్టం2013లోని సెక్షన్ 10(ఏ) నిబంధనను మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లను వ్యతిరేకిస్తూ పీ గోపాల్‌నాయక్ సహా 15 మంది రైతులు, కే శివకుమార్, ఇతర రైతులు దాఖలు చేసిన రెండు వేర్వేరు వ్యాజ్యాలపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మసనం రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. కారణం చెప్పకుండా ‘అత్యవసర భూసేకరణ’ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడాన్ని కోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది. అత్యవసర భూ సేకరణను ఎందుకు చేయాలని నిర్ణయించారో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులైన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (భూసేకరణ), వికారాబాద్ జిల్లా కలెక్టర్, లగచర్ల రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, దుద్యాల తహసీల్దార్, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు నోటీసులు జారీచేసింది.
భూసేకరణ నోటిఫికేషన్లు చట్ట వ్యతిరేకం
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బీఎస్ ప్రసాద్, వీ రఘునాథ్ వాదించారు. పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందని, మొత్తం 1,177 ఎకరాల్లో 534 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, మిగిలినవి పట్టా భూములని కోర్టుకు వివరించారు. పట్టా భూముల సేకరణకు ప్రభుత్వం చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రక్రియలో భాగంగా లగచర్లలో 110 ఎకరాలు, హకీంపేటలో 351 ఎకరాల రైతుల భూములను అత్యవసర ప్రాతిపదికపై భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చిందని పేర్కొన్నారు. భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా భూమిని సేకరిస్తున్నారని వాదించారు. భూసేకరణ నోటిఫికేషన్లలో ఎంత భూమి అవసరమో, ఏ అవసరాల కోసం భూసేకరణ చేస్తున్నారో వివరాలు ఏమీ లేవని తెలిపారు. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10 (ఏ) ప్రకారం అత్యవసర భూసేకరణ చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఆ ‘అత్యవసరం’ ఏమిటో నోటిఫికేషన్లో పేరొనాలన్న నిబంధనను ప్రభుత్వమే ఉల్లంఘించిందని వివరించారు. భూమి సేకరణ ఎందుకు చేపడుతున్నారనే వివరాలు నోటిఫికేషన్లలో పేరొనలేదని తప్పుబట్టారు.
అత్యవసర భూసేకరణ ఎందుకో చెప్పకుండానే..
దేశభద్రత, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ‘అత్యవసరం’ వంటి కీలక అంశాలతో ముడిపడినప్పుడు మాత్రమే ఆ నిబంధన కింద అత్యవసర భూసేకరణ చేయాలని బీఎస్ ప్రసాద్ చెప్పారు. సామాజిక ప్రభావ అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ, మార్కెట్ విలువ, పునరావాసం, పునర్ నిర్మాణం మొదలైవి నిర్ధారణ చేయకుండానే ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియ చేపట్టడం చెల్లదని వాదించారు. ఎందుకు భూసేకరణ చేస్తున్నదీ భూమిని కోల్పోబోయే రైతులకు చెప్పాలని, అయితే, ప్రభుత్వం వాటిని వివరించకుండా ఏకపక్షంగా భూసేకరణ ప్రక్రియను ప్రారంభించి చట్ట నిబంధనలకు నీళ్లు వదిలిందని వివరించారు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్పార్ ఏర్పాటుచేస్తున్నామని చెప్పి జీవనాధారమైన రైతుల భూములను ఏకపక్షంగా, చట్ట వ్యతిరేకంగా సేకరణ చేయడానికి వీల్లేదని వాదించారు. రైతుల జీవనాధారం ఈ భూములేనన్న కీలక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టును కోరారు. రాజ్యాంగం కల్పించిన హకులను ప్రభుత్వం కాలరాస్తూ రైతుల నుంచి భూములను గుంజుకోడానికి వీల్లేదని చెప్పారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.
రెండు పిటిషన్లు ఇవీ..
లగచర్లలో ఫార్మావిలేజ్ల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో వెనకు తీసుకున్నది. లగచర్లతోపాటు హకీంపేట, పోలేపల్లిలో దాదాపు 1,358 ఎకరాల భూ సేకరణకు ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నది. అయితే ఫార్మావిలేజ్లకు బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్పారు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దీనికోసం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లో 1,177.35 ఎకరాలు సేకరించేలా 2024 నవంబర్ 29న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 534 ఎకరాలు సరార్భూమి కాగా, మిగతా 643 ఎకరాలు పట్టా భూమి. లగచర్లలో 110.32 ఎకరాలు, హకీంపేటలో 351.10 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. లగచర్లకు చెందిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ పీ గోపాల్నాయక్తోపాటు మరో 14 మంది ఒక పిటిషన్, హకీంపేటకు చెందిన భూముల సేకరణ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ కే శివకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు.
నిరుపేద రైతుల భూములను లాకోవడం దారుణం
పిటిషనర్లు నిరుపేద రైతులని, సదరు భూమిని సాగు చేసుకుంటూ వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్నారని బీఎస్ ప్రసాద్ చెప్పారు. ఫార్మావిలేజ్ వద్దంటూ పోరాటం చేయగానే ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత రెండు రోజులకే బహుళార్ధసాధక పారిశ్రామిక పారు (మల్టీపర్పస్ ఇండస్ట్రియల్పార్) పేరిట నోటిఫికేషన్లు జారీ చేయడం దారుణమని పేర్కొన్నారు. నిపుణుల సామాజిక ప్రభావ అంచనా నివేదిక, ప్రజాభిప్రాయ సేకరణ, మారెట్ విలువ నిర్ధారణ లేకుండా భూ సేకరణకు ఉపక్రమించి చట్టాన్ని తుంగలోకి తొకిందని తెలిపారు. అత్యవసర భూ సేకరణ ఎందుకో వెల్లడించకుండా, భూసేకరణ చట్టంలోని సెక్షన్-10(ఏ) కింద భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అడ్డదారిలో పయనించిందని, ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకు విన్నవించారు.
స్టే ఇవ్వొద్దన్న సరార్
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ, రైతులకు తగిన పరిహారం చెల్లిస్తున్నామని, ఆ తర్వాతే భూములు తీసుకుంటామని చెప్పారు. ఒకో ఎకరాకు రూ.20 లక్షల పరిహారంతోపాటు 150 గజాల ఇంటిస్థలం, ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణానికి సాయం అందజేస్తామని తెలిపారు. అర్హులైన వారికి ఉద్యోగ కల్పన కూడా ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియను చాలామంది రైతులు ఆమోదించారని, భూసేకరణ ప్రక్రియపై స్టే ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. అప్పటివరకు భూసేకరణ ప్రక్రియలో ముందుకెళ్లరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
చట్టంలో ఏముందంటే..
అత్యవసర భూ సేకరణ నిమిత్తం గతంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం2013లో సెక్షన్-10ఏ, సెక్షన్-40లను చేర్చింది. వీటి కింద భూసేకరణ చేయాలంటే అత్యవసరంగా భూసేకరణ ఎందుకు చేపట్టేదీ నోటిఫికేషన్లో పేరొనాలి. భూ సేకరణ చట్టం-2013లోని ఈ సెక్షన్ల ప్రకారం.. ప్రజలు, రైతుల అభిప్రాయం, గ్రామసభలు అవసరం లేకుండా నేరుగా భూ సేకరణ చేపట్టవచ్చు. ఇది దేశభద్రత, అత్యవసర ప్రాజెక్టుల నిర్మాణాల నిమిత్తం భూసేకరణ చేసేందుకు వీలుంటుంది. భూములు కోల్పోయే రైతులకు కూడా అత్యవసర ప్రాజెక్టు ఆవశ్యకత విషయాలను తెలియజేయాలి. నిర్ధేశించిన ప్రాజెక్టుకు అవసరమైన భూమిని మాత్రమే ప్రభుత్వం సేకరణ చేయాలి. ఇవేమీ చేయకుండా ఆ సెక్షన్ల కింద బలవంతంగా భూమిని సేకరించడానికి వీల్లేదు. ఈ భూ సేకరణ ఎందుకు చేస్తున్నదీ, అత్యవసర భూసేకరణ ఎందుకు వచ్చిందీ, అలాంటి అవసరం ఏముందీ? తదితర వివరాలను నోటిఫికేషన్లో పేరొనలేదు. ప్రభుత్వం తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, రాజ్యాంగంలోని 14,19,21 అధికరణలను ఉల్లంఘించి వెలువరించిన భూసేకరణ నోటిఫికేషన్ చెల్లదని పిటిషనర్లు వ్యాజ్యాల్లో పేరొన్నారు.