హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూనే అదనపు షోల పేరుతో ఎలా అనుమతిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రంలో అదనపు షోలను అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అర్ధరాత్రి, తెల్లవారుజాము న సినిమాలను ప్రదర్శిస్తే ప్రజల ఆరోగ్యం ఏంకావాలని, అర్ధరాత్రి 2 గంటల తర్వాత మీ పిల్లలను రోడ్లపై తిరిగేందుకు, సినిమాలు చూసేందుకు అనుమతిస్తారా అని ప్రశ్నించింది. ప్రజల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేవరకు తెల్లవారుజాము వేళల్లో సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వరాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ తీరు మారకపోతే రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, పబ్‌ల మూసివేతకు స్వయంగా తామే ఉత్తర్వులు జారీ చేస్తామని ఘాటుగా హెచ్చరించింది. టికెట్ల రేట్లను పెంచబోమని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ‘గేమ్ చేంజర్’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతించడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ధరల పెంపుఉత్తర్వులపై 24 గంటల్లోగా పునఃసమీక్ష చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘గేమ్ చేంజర్’ సినిమా అదనపు షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసింది.