హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పంచాయతీలో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సరారును హైకోర్టు ఆదేశించింది. మండల పంచాయతీ అధికారి, కార్యదర్శుల అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రుద్రంగి పంచాయతీలోని ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణాలకు అనుమతిస్తున్నారంటూ 2014 డిసెంబరు 9న వినతిపత్రం ఇచ్చినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామానికి చెందిన పీ నరేశ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుకతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది తీగల రాంప్రసాద్ వాదనలు వినిపిస్తూ పంచాయతీ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి సుధాకర్, కార్యదర్శి రాందాస్ హన్లూ అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని, ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని సూచించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ డివిజనల్ పంచాయతీ అధికారి దీనిపై విచారణ జరిపించి నివేదిక తెప్పించినట్టు తెలిపారు. నివేదిక ఆధారంగా పిటిషనర్ సమక్షంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం అక్రమాలపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.