హైదరాబాద్ మే 3 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో తలెత్తిన వివాద పరిషారంలో భాగంగా ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయని హెచ్ఎండీఏకు హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆ జరిమానాను 2 వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. కొల్లూరు నుంచి పటాన్చెరు వరకు 8 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం, నిర్వహణ నిమిత్తం సైబరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వేతో హెచ్ఎండీఏ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీఓటీ) ప్రాతిపదికన కుదిరిన ఈ ఒప్పందంలో వివాదం తలెత్తడంతో ఇరుపక్షాలు ఆర్బిట్రేషన్‌కు వెళ్లాయి. వారి వాదనలను విన్న ఆర్బిట్రేటర్.. సైబరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌కు రూ.140.89 కోట్లతోపాటు రూ.39.50 కోట్ల వడ్డీ చెల్లించాలని హెచ్ఎండీఏను ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ హెచ్ఎండీఏ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం.. ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయకపోవడం వల్ల సైబరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌కు నష్టం వాటిల్లిందని, అందువల్ల ఆ సంస్థకు రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని హెచ్ఎండీఏకు స్పష్టం చేసింది.