హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): భూ వివాదంలో తమ ఆదేశాలను బేఖాతరు చేసిన సైబరాబాద్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నట్టు తెలిసి కూడా పోలీసులు కొందరికి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింది. భూ వివాదంలో మీ సొంత విచక్షణ అవసరం లేదని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నంబరు 87/2లో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సుమారు రూ.200 కోట్లకు పైగా విలువైన 2.08 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డులో సుబ్బారెడ్డి భార్య వైవీ స్వర్ణలతారెడ్డి పేరిట ఈ భూమి నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి తమదంటూ ప్రభుత్వ పెద్దల్లో ఒకరికి సన్నిహితులైన జీ నర్సింహారెడ్డి, షేక్ ఇస్లాముద్దీన్, కొప్పుల మల్లారెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేశారు. దీంతో స్వర్ణలతారెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, వారు ఆ ఫిర్యాదును బుట్టదాఖలు చేశారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించి ఆ భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకున్నారు. అయినప్పటికీ సదరు వ్యక్తులు తమ అధికార ప్రాబల్యాన్ని ఉపయోగించి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించేందుకు ప్రయత్నించారు. దీంతో స్వర్ణలతారెడ్డి మరోమారు హైకోర్టును ఆశ్రయించారు.
కొండాపూర్‌లోని సర్వే నంబర్ 87/2లోని 6.23 ఎకరాల చుట్టూ ఉన్న రెండెకరాల వివాదంలో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని స్వర్ణలతారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పక్షపాతంతో వ్యవహరిస్తున్న మాదాపూర్ డీసీపీ, ఏసీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాస్‌రావు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వినోద్‌కుమార్ దేశ్‌పాండే, రోహిత్ పోగుల వాదనలు వినిపించారు. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలున్న ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని వాదించారు. కాంపిటెంట్ కోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా ఇంజక్షన్ ఉత్తర్వులు జారీచేసిందని, హైకోర్టు కూడా ప్రైవేట్ వ్యక్తి అప్పీల్‌ను తోసిపుచ్చిందని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, భూమిని స్వాధీనం చేసుకోవడానికి వారికి మద్దతు ఇస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. చట్టానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రైవేట్ పార్టీని ఆదేశిస్తూ, విచారణను జూన్‌కు వాయిదా వేశారు.
స్వర్ణలతారెడ్డి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు చట్టాన్ని పాటించాలని పోలీసులను ఆదేశించింది. కాంపిటెంట్ కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఉత్తర్వులను పాటించకుంటే తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉత్తర్వులను ఉల్లంఘించినట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పుడు పోలీసులు సొంత విచక్షణతో వ్యవహరించలేరని తేల్చిచెప్పింది. పిటిషనర్ ఫిర్యాదును పరిశీలించి, చట్టప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.