హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): చెరువుల ఆక్రమణలకు సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాతే చట్టానికి అనుగుణంగా దర్యాప్తు చేపట్టాలని సైబరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలను ప్రోత్సహించారని ఆరోపిస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఉద్యోగులపై గత నెల 30న సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని మేడ్చల్ మలాజిగిరి సర్వే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, మరో ఉద్యోగి పూల్‌సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ సుజన విచారణ జరిపారు.
పిటిషనర్లపై నమోదైన అభియోగాలన్నీ ఏడేండ్లలోపు శిక్ష పడేవైనందున వారికి బీఎన్ఎస్ఎస్లోని 35(3) సెక్షన్ కింద నోటీసులు జారీచేసి, వివరణ తీసుకోవాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుల ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, మెజిస్ట్రేట్‌కు సమర్పించే తుది నివేదికకు జత చేయాలని ఆదేశిస్తూ.. పిటిషన్లపై విచారణ ముగిసినట్టు ప్రకటించింది.