హైదరాబాద్, అక్టోబర్ 15, (నమస్తే తెలంగాణ): సదర్ పండుగ వేళ జంతువులపై హింసను నిరోధించేందుకు చేపట్టిన చర్యలేమిటో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సదర్ వేడుకలకు అనుమతులు ఇచ్చేముందు జంతు హింస నివారణకు చర్యలు చేపట్టాలని ఈ నెల 9న డీజీపీకి వినతిపత్రం సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఏ గౌతం వేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు.
సదర్ పేరుతో జంతు హింస విపరీతంగా పెరుగుతున్నదని, దున్నపోతులు, ఎద్దులకు ముకులో తాళ్లుకట్టి లాగుతూ వాటిని చిత్రహింసకు గురి చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేస్తూ.. జంతు హింస నివారణ చట్టాన్ని ఉల్లంఘించినవారిపై కేసులు నమోదుచేసి, చర్యలు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. సదర్ వేడుకల నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారో లేదో తెలుసుకుని చెప్పేందుకు గడువు కావాలని కోరారు. దీంతో పిటిషనర్ వినతిపత్రంపై కౌంటర్లు దాఖలు చేయాలని పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శితోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రామగుండం పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీచేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.