హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : కూల్చివేతలకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే వరకు, అక్రమకట్టడాలు, ఆక్రమణల తొలగింపు పేరుతో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని హైకోర్టు మరోసారి స్పష్టంచేసింది. ఏ చట్ట నిబంధన ప్రకారం కూల్చివేస్తున్నారో, అందుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు వెల్లడించే వరకు హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను సోమవారం మరోసారి పొడిగించింది. ఈ ఆదేశాలు రోడ్లు, నాలాలు, డ్రైనేజీలు వంటి ఆక్రమణల తొలగింపునకు అడ్డం కాబోవని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. ఇటీవల ఓ 98 ఏండ్ల వృద్ధుడి ఆస్తిని కూల్చివేసిన దానిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. శిథిలాల కింద ఉన్న విలువైన వస్తువులను బాధితుడు తిరిగి పొందేందుకు సంబంధిత అధికారులు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ రైతు ఎంఏ షరీఫ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, అమీన్పూర్ తహసీల్దార్‌తోపాటు సంబంధిత ఏసీపీ, శిథిలాల నుంచి పిటిషనర్‌కు సంబంధించిన విలువైన వస్తువులను వెలికితీయడంలో సహకరించాలని స్పష్టం చేశారు. గతంలో తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో హైడ్రా అధికారులు తమ సిబ్బంది, పోలీసులతో కలిసి పిటిషనర్‌కు చెందిన భూమిలోకి ప్రవేశించి, రెండు అంతస్తుల ఇల్లు, శతాబ్ద కాలం నాటి పూర్వీకుల ఇల్లు, వాటర్ ట్యాంక్, కాంపౌండ్, పశువుల షెడ్లు కూల్చివేసినట్టు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కనీసం వస్తువులను తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంతో విలువైన గృహోపకరణాలు శిథిలాల కింద ఉండిపోయాయని తెలిపారు. సీసీ కెమెరాలు, డీవీఆర్ వ్యవస్థను తొలగించినట్లు ఆరోపించారు. స్పందించిన న్యాయమూర్తి పిటిషనర్‌కు చెందిన వస్తువులను తీసుకొనేందుకు తహసీల్దార్, ఏసీపీ సహకరించాలని ఆదేశించారు.
విచారణ సమయంలో జారీచేసిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించారు. హైడ్రా లేదా ఇతర సంస్థలు హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీల పరిధుల్లో కూల్చివేతలు చేపట్టేటప్పుడు, నదులు, నాలాలు, ప్రజా రహదారుల ఆక్రమణలను తొలగించే సందర్భాలు తప్ప, ఇతర కూల్చివేతల విషయంలో చర్యలు చేపట్టకూడదని స్పష్టం చేశారు. అంతర్గత రహదారుల వివాదాలు లేదా కాంపౌండ్ తొలగింపు, అక్రమ , అనుమతి లేని నిర్మాణాల పేరుతో కూల్చివేత చర్యలు తీసుకోవాలంటే, చట్టబద్ద మార్గదర్శకాలు ఏమున్నాయో నివేదించాలని చెప్పారు. ముందస్తు అవకాశం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం వల్ల పిటిషనర్ హక్కులను హైడ్రా ఉల్లంఘిస్తున్నదని అభిప్రాయపడ్డారు. పిటిషనర్‌కు కుటుంబానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తేలా చేసిందని వ్యాఖ్యానించారు. ఐలాపూర్‌లో చేపట్టిన కూల్చివేతల వ్యవహారంలో బాధితులకు వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.