హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన దాడి కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిశాంక్‌తోపాటు మరో ఏడుగురికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే సుజన ఉత్తర్వులు జారీచేశారు. ఏప్రిల్ 23న మధ్యాహ్నం దుండిగల్ పరిధిలోని తన నివాసంలో ఉన్న టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుండమల్ల రాజేంద్రకుమార్.. తనపై మన్నె క్రిశాంక్‌తోపాటు మరికొందరు దాడి చేశారని ఆరోపించారు. ఫేస్బుక్లో తమపై ప్రతికూల పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ తన ఇంట్లోకి చొరబడి కొట్టారని, మొబైల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కూకట్పల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ.. ఫిర్యాదుదారు కాంగ్రెస్ నాయకుడు అని, ఏప్రిల్ 22న మన్నె క్రిశాంక్ ఆయన భార్య ఫొటోలను ఉపయోగించి ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినట్టు నకిలీ వార్తను ఫేస్బుక్లో ప్రచారం చేశారని తెలిపారు. ఆ వార్త ఫేక్ అని ఆంధ్రప్రభ పత్రిక ఖండించిందని కోర్టుకు వివరించారు. దీనిపై మన్నె క్రిశాంక్ ముందుగానే కూకట్పల్లి ఎస్‌హెచ్‌వోకు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు.
అనంతరం ప్రతీకార ధోరణితో తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ కేసు పెట్టారని తెలిపారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం రామచంద్రారెడ్డి బెయిల్ మంజూరు చేయరాదంటూ వాదించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలు సేకరించామని, నిందితులు రెండు కార్లలో ఘటనాస్థలికి వచ్చి వెళ్లినట్టు గుర్తించామని తెలిపారు. బాధితుడికి గాయాలు అయినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు వివరించారు. మన్నె క్రిశాంక్‌పై ఇప్పటికే 21 కేసులు ఉన్నాయని, బెయిల్ ఇస్తే మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. వాదనలపై స్పందించిన హైకోర్టు.. కేసులో ప్రధానంగా చేర్చిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 308(5) కింద రిమాండ్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించిందని గుర్తించింది. మిగిలిన నేరాలకు గరిష్ఠ శిక్ష ఏడేండ్లలోపే ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే సాక్షుల విచారణలో భాగంగా పలువురి వాంగ్మూలాలు నమోదు కావడం, నిందితులు ఏప్రిల్ 23 నుంచి జైలులో ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా షరతులు విధించింది. పిటిషనర్ రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల పాటు ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంబంధిత ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.