హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : తెలుగును ద్వితీయ భాషగా దశలవారీగా అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, అన్ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా అమలు చేస్తున్న తీరును కూడా వివరించాలని ఆదేశించింది. తెలుగును తప్పనిసరి చేస్తూ గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం జారీచేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేం బ్రిడ్జ్, ఇతర జాతీయ బోర్డు పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబరు 7, 19 తేదీల్లో ప్రొసీడింగ్స్ జారీచేసింది. ఈ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రమీలా పాఠక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉన్నట్లుండి తెలుగును తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన హకుల ఉల్లంఘనేనని పేరొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ, అన్ఎయిడెడ్, పలు ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ ఉత్తర్వులు అమలవుతున్నాయని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం తెలుగును ద్వితీయ భాషగా దశలవారీ అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.