హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట సర్వే నంబర్ 16లోని 10.20 ఎకరాల్లో జోక్యం చేసుకోరాదని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. ఈ మేరకు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ తమ పట్టా భూముల్లో హైడ్రా జోక్యం చేసుకోవడంపై హైదరాబాద్‌కు చెందిన వై అంతిరెడ్డి, మరో 8 మంది హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ జరిపారు.
ఆ భూమిని ప్రభుత్వం 2002లోనే క్రమబద్ధీకరించిందని, దీంతో పిటిషనర్లు చాలా ఏండ్లుగా పన్ను చెల్లిస్తున్నారని, అయినప్పటికీ అది ప్రభుత్వ భూమని పేర్కొంటూ ఫెన్సింగ్ వేసేందుకు హైడ్రా యత్నిస్తున్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివరించారు. దీనిపై పూర్తి వివరాలను తెలియజేసేందుకు గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ కోరడంతో అందుకు అనుమతించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేశారు. అప్పటివరకు ఈ భూముల్లో జోక్యం చేసుకోరాదని హైడ్రాను ఆదేశించారు.