High Court | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల నియామకాలకు బ్రేక్ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు అనుమతిచ్చింది. అభ్యర్థుల డాటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమర్పించాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలంటూ ఎం పరమేశ్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు గురువారం విచారణ చేపట్టారు.
పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి టీజీపీఎస్సీకి నోటీసులు జారీచేశారు. రీకౌంటింగ్ దరఖాస్తు చేస్తే మారులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను కూడా ఆదేశించారు. పిటిషనర్లు ప్రస్తుతం ఎకడ పనిచేస్తున్నారో, వాళ్ల హోదా, ఇతర వివరాలను నివేదించాలన్నారు. ఒకవేళ తప్పుడు వివరాలతో పిటిషన్లు వేసుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్లను హెచ్చరించారు. అదే సమయంలో టీజీపీఎస్సీలో అవకతకవలు జరిగాయని తేలితే కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో రెండే రెండు పరీక్షా కేంద్రాల నుంచి ఏకంగా 71 మంది ఎంపికయ్యారని చెప్పారు. ఇది అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నదని అన్నారు. ఇక 482 మారులు వచ్చిన ఒక అభ్యర్థి ఇంకా ఎకువ మారులు వస్తాయని రీకౌంటింగ్ చేయించుకుంటే అవి 422కు తగ్గిపోయాయని తెలిపారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో పబ్లిష్ చేయడానికి కంప్యూటర్స్‌లో మార్పులు చేశారని, లాగ్ హిస్టరీ పరిశీలిస్తే ఈ బాగోతం బట్టబయలు అవుతుందని చెప్పారు. దీనిపై అడిగితే ఫోర్జరీ అని చెప్తున్నారని, ఇదే నిజమైతే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఇవన్నీ గ్రూప్-1లో అక్రమాలు జరిగాయని చెప్పడానికి కీలక అంశాలని తెలిపారు.
గ్రూప్-1 మెయిన్‌కు 21,075 మంది హాజరయ్యారని, ఆ తర్వాత తుది జాబితాలో ఆ సంఖ్య 21,085కు పెరిగిందని, కొత్తగా పది మంది ఎకడి నుంచి వచ్చారనే ప్రశ్నకు జవాబు లేదని రచనారెడ్డి చెప్పారు. గ్రూప్-1లో అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఇంతకంటే మరో సాక్ష్యం అవసరం లేదని అన్నారు. ఉర్దూలో 9 మంది పరీక్ష రాశారని ప్రకటించిన కమిషన్ ఆ తర్వాత ఆ సంఖ్యను 10 మంది అని చెప్పడం కూడా కూడా అలాంటి అక్రమమేనని అన్నారు. ఇది ఎంతోకాలం గ్రూప్-1 పోస్టులను సాధించాలన్న నిరుద్యోగుల కలలను కల్లలు చేయడమేనని చెప్పారు. దేశంలోని వివిధ ప్రభుత్వ కాలేజీల్లోని నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయిస్తామని సర్వీస్ కమిషన్ చెప్పిందని, తీరా రిటైర్ అయిన వాళ్లతో చేయించిందని తెలిపారు.
పదవీ విరమణ చేసినవారితో మూల్యాంకనం ఎందుకు చేయించిందీ సర్వీస్ కమిషన్ వివరణ ఇవ్వలేదని అన్నారు. రిటైర్ అయిన వారిలో ప్రొఫెసర్ పీ నర్సయ్య కూడా ఉన్నారని, ఆయన 2004లో పదవీ విరమణ చేశారని, అలాంటి వాళ్లకు తెలంగాణ ఉద్యమ పరిణామాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మల్లిక్ అనే ప్రొఫెసర్ ప్రైవేటు సంస్థ నుంచి కూడా వేతనం పొందుతున్నారని, ఆయన మూల్యాంకనం చేస్తే రాగద్వేషాలకు అతీతంగా ఉంటుందని ఎలా భరోసా ఇవ్వగలరని సందేహం వ్యక్తంచేశారు. ప్రిలిమ్స్‌కు, మెయిన్‌కు హాల్ టికెట్ల నంబర్లు వేర్వేరుగా ఇవ్వడంలో కూడా కావాలని తప్పులు చేశారని ఆరోపించారు. తొలుత 45 సెంటర్లని ప్రకటించి ఆ తర్వాత 46 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారని, రెండు సెంటర్లల్లో పరీక్షలు రాసిన వారిలో 71 మంది అర్హత సాధించడం వెనుక దాగిన ‘ప్రతిభ’ ఏమిటో తేలాల్సివుందని అన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గ్రూప్-1 నియామక ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.
టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది పీ రాజశేఖర్ ప్రతివాదన చేస్తూ, తప్పుడు వివరాలతో నియామకాల నిలుపుదలకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. పిటిషనర్లలో 20 మందిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులేనని, వాళ్లు ఎకడ పనిచేసేదీ వివరాలు సమర్పించలేదని తెలిపారు. వివరాలు లేని పిటిషన్ దాఖలు చేయడం సరికాదని అన్నారు. గ్రూప్-1 పోస్టులకు 2014 నుంచి నియామకాలు జరగలేదని, ఉద్యోగాలు చేస్తున్న పిటిషనర్లు నిరుద్యోగుల అవకాశాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు. రీకౌంటింగ్‌లో ఒక అభ్యర్థి మారులు తగ్గాయనడం వాస్తవం కాదని, తొలుత 422.5 మారులు వచ్చాయని, రీకౌంటింగ్‌లో కూడా అవే మారులు వచ్చాయని తెలిపారు. అయితే మారులను 49 వస్తే 69, 77 వస్తే 87, 62.5 వస్తే 82.5 ఈ తరహాలో ఫోర్జరీ చేశారని చెప్పారు.
ఈ వ్యవహారంపై సర్వీస్ కమిషన్ విచారణ చేపట్టిందని, షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయని తెలిపారు. వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక పరీక్ష కేంద్రంలో వికలాంగులకు అనుకూలంగా లేకపోవడం వల్ల మరో సెంటర్ అదనంగా ఏర్పాటు చేశామని చెప్పారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటుచేసిన రెండు సెంటర్లలో ఎకువమంది ఎంపికయ్యారని అంగీకరించారు. పరీక్ష కేంద్రం 18లో 792కి గాను 39 మంది, మరో ఎగ్జామ్ సెంటర్ 19లో 864కుగాను 32 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఇది కేవలం నాలుగు శాతం కంటే తకువని అన్నారు. ఇదే సెంటరులో మిగిలిన అభ్యర్థులెవరూ అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేయలేదని, ఈ విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కోఠి మహిళా కళాశాలలో ఇన్విజిలేటర్లు, సిబ్బంది అందరూ మహిళలే కావడంతో కాలేజీ అభ్యర్థన మేరకు అకడ కేవలం మహిళా అభ్యర్థులే పరీక్ష రాసినట్టు చెప్పారు.
మహిళా కాలేజీలో టాయిలెట్లను వినియోగించాల్సి ఉంటుందని, అకడ పురుషులను అనుమతిస్తే రహస్య కెమెరాలు వంటి సమస్యలు తలెత్తకుండా కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. సెంటర్ల ఎంపిక పూర్తిగా జిల్లా కలెక్టర్లే చేస్తారని చెప్పారు. మెయిన్‌లో పురుషుల కంటే మహిళలు బాగా పరీక్ష రాశారని తేలిందని అన్నారు. హాల్‌టికెట్ల నంబర్లు మారినప్పటికీ ప్రతి మెయిన్ హాల్ టికెట్లో ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నంబరును పేరొన్నట్టు చెప్పారు. ఐదు లక్షల మంది ప్రిలిమ్స్ రాయగా, 21 వేల మంది మెయిన్‌కు ఎంపికయ్యారని, వీళ్లకు వరుస నంబర్లు కేటాయించడానికి వీలుగా హాల్ టికెట్ల నంబర్లకు ప్రత్యేక సీరియల్ ఇచ్చినట్టు చెప్పారు.
పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు 21,075 మంది పరీక్ష రాసినట్టు మీడియాకు వెల్లడించడం జరిగిందని, ఆ తర్వాత బయోమెట్రిక్ ఆధారంగా కచ్చితమైన వివరాలు అందాక ఆ సంఖ్య 21,085కు పెరిగిందని వివరించారు. పది మంది పెరగడం అంటే అది స్వల్పమేనని అన్నారు. ఆర్సీ రెడ్డి స్టడీ సరిల్లో పనిచేస్తున్న జీఏ మల్లిక్‌ను మూల్యాంకనం కోసం ఎంపిక చేశామనే అభియోగం అవాస్తవమని చెప్పారు. మల్లిక్ చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేస్తున్నారని, అంబేదర్ ఓపెన్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా రిటైర్ అయిన నర్సయ్య అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని మూల్యాంకనం కోసం వినియోగించుకున్నామని చెప్పారు.
పదవీ విరమణ చేసినవారు మూల్యాంకనం చేయకూడదనే రూల్ ఎకడా లేదని అన్నారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి మాట్లాడిన విషయాలే పిటిషన్లో ఉన్నాయని తెలిపారు. గ్రూప్-1 అభ్యర్థులకు ఏవిధంగానూ అన్యాయం జరగలేదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, గ్రూప్-1 నియామకాలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవచ్చునని చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
గ్రూప్-1 పరీక్ష ఫలితాలు ఈ నెల 10న విడుదలయ్యాయి. తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని అభ్యర్థుల అభియోగం. ఈ తరుణంలో పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని అభ్యర్థులు హైకోర్టును కోరారు. ‘గ్రూప్-1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగింది. మొత్తం18 రకాల సబ్జెక్టులు ఉంటే 12 సబ్జెక్టుల పేపర్ల్లను నిపుణులతోనే దిద్దించారు. తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మూడు భాషల్లో పరీక్ష నిర్వహించారు. వాటిని తగిన నిపుణులతో దిద్దించలేదు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో ఇంగ్లిష్, తెలుగు మీడియం పేపర్లు మూల్యాంకనం చేయించారు. వారిలో చాలా మందికి తెలుగు, ఉర్దూ తెలియదు.
ఈ కారణంగా తెలుగు, ఉర్దూ భాషలలో పరీక్షలు రాసిన అభ్యర్థులు మారులను కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన నిపుణులకు తెలంగాణ ఉద్యమం, స్థానిక చరిత్ర వంటి అంశాలపై అవగాహన ఉండదు. నిబంధనలకు తిలోదకాలిచ్చి చేసిన మూల్యాంకనం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. కాబట్టి గ్రూప్-1 మెయిన్ పరీక్ష జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలి. ఆ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఆదేశాలివ్వాలి. అప్పటివరకు తదుపరి నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలి’ అని కోరుతూ ఖమ్మంకు చెందిన ఎస్ నరేశ్‌తోపాటు మరో 22 మంది పిటిషన్లు దాఖలు చేశారు.
గ్రూప్-1 పోస్టుల నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గతంలోనే హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ముందున్న వ్యాజ్యాలపై తుది ఉత్తర్వులు వెలువడేలోగా ప్రభుత్వం గ్రూప్-1 పోస్టుల భర్తీలో ఎస్టీ రిజర్వేషన్లను పెంపుదల నిర్ణయాన్ని అమలు చేస్తే అవి తామిచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని ఈ నెల 10న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరగనుంది.