హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్లను గుర్తించాలని, ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రక్రియ ఏ దశలో ఉన్నదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హెచ్ఎండీఏ పరిధిలోని రామమ్మకుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిర్మాణాలు చేపట్టిందనే వ్యాజ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడంపై దాఖలైన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం మళ్లీ విచారణ చేపట్టింది. అన్ని చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్కు చెందిన అన్ని అంశాలపై సుమోటోగా విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల్లో ఎన్నింటికి ఎఫ్టీఎల్ నిర్ధారణ చేశారో, ఎన్నింటికి చేయాలో, నిర్ధారణ చేసేందుకు జారీచేసిన నోటిఫికేషన్ అమలు ప్రక్రియ ఏ దశలో ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పీ శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ హెచ్ఎండీఏ పరిధిలో 3,342 చెరువులున్నాయని, వాటిలో 2,793 చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తింపునకు ప్రాథమిక నోటిఫికేషన్ వెలువరించామని చెప్పారు. 708 చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ వెలువరించినట్టు వివరించారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాక మరో 57 చెరువులకు తుది నోటిఫికేషన్ జారీచేసినట్టు చెప్పారు. మిగిలిన చెరువులకు ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వివరాల నివేదనకు గడువు కావాలని కోరారు. ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది.