హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో కేసుల నమోదుకు అమలు చేయాల్సిన విధివిధానాలతో పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మేరకు మద్రాస్ హైకోర్టుతోపాటు 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పటాన్‌చెరులోని ఓ ఫంక్షన్ హాలులో డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. ఐపీసీలోని సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు సందర్భంగా పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 195లో పేరొన్న నిబంధనలను అమలు చేయలేదని ఆక్షేపించింది.
ఆ సెక్షన్ కింద అభియోగాలు మోపేందుకు రాతపూర్వక ఆధారాలు ఉండాలని తెలిపింది. బీఆర్ఎస్కు చెందిన నలుగురు రూ.52,400 నగదుతోపాటు కొందరి ఓటరు ఐడీలతో ఉన్నట్టు ఫిర్యాదులో ఉన్నప్పటికీ అందుకు గల ఆధారాలేమిటో ఎఫ్ఐఆర్ లేదా చార్జిషీట్లో ప్రస్తావించలేదని పేర్కొన్నది. ఇవేమీ లేకుండా కింది కోర్టు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడం చెల్లదని స్పష్టం చేస్తూ.. సెక్షన్ 188 కింద రోహిత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.