హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల్లో రెండో ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఇవ్వాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నియామక నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం చేయాలని, ఇష్టానుసారంగా పరీక్ష విధానాన్ని మార్చొద్దని చెప్పింది. నోటిఫికేషన్లలో పేపర్-2 ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లిష్‌లో ఇవ్వటాన్ని ఆదిలాబాద్‌కు చెందిన టీ విజయ్‌కుమార్ సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ కే శరత్ విచారణ జరిపారు. జూనియర్ కాలేజీలు ఇంగ్లిష్, తెలుగు మీడియాల్లో ఉన్నాయని, రెండో పేపర్ ఇంగ్లిష్‌లో మాత్రమే ఇవ్వటం వల్ల తెలుగు మీడియం వారు నష్టపోతారని చెప్పారు. కమిషన్ తరఫు న్యాయవాది రాంగోపాల్‌రావు వాదిస్తూ, ఆ పోస్టుల భర్తీకి విద్యార్హత పీజీగా నిర్ణయించినట్టు తెలిపారు.
ఇంగ్లిష్‌లో పేపర్ ఇవ్వటం వల్ల నష్టమేమీ లేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి యూనివర్సిటీల ప్రాస్పెక్టస్ పరిశీలించాక ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల దూరవిద్య కేంద్రాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనమిక్స్, హిస్టరీ సబ్జెక్ట్‌ను తెలుగు, ఆంగ్లంలోను, డాక్టర్ బీఆర్ అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియల్ సైన్సెస్, ఎంఏ ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ తెలుగులో మాత్రమే బోధిస్తున్నట్టు తేలిందని చెప్పారు. జూనియర్ లెక్చరర్ పోస్టుల రాత పరీక్షల్లో పేపర్ 2 ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఇవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించారు.