హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని, పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంతోపాటు ఈ కేసుకు సంబంధించిన ఇతర పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. పోలీసుల తరపు సీనియర్ న్యాయవాది ఆర్ఎన్ హేమేంద్రనాథ్రెడ్డి వాది స్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ సిర్పూరర్ కమిషన్ ఈ కేసుపై విచారణ జరిపి నివేదిక సమర్పించిందని, ఆ నివేదికకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్లపై ఇదే హైకోర్టు విచారణ జరుపుతున్నదని వివరించారు. ఆనివేదిక ఆధారంగా ఎలాంటి కేసులు నమో దు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయని, సింగిల్ జడ్జి వద్ద కూడా పిటిషన్లు ఉన్నాయని చెప్పారు. దీంతో సింగిల్ జడ్జి వద్ద దాఖలైన పిటిషన్లు, వాటిపై వెలువడిన ఉత్తర్వుల వివరాలను అఫిడవిట్ రూపంలో నివేదించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): విద్యాప్రమాణాల పెంపు కోసం అమలుచేస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్), లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(లిప్) కార్యక్రమాల అమలులో భాగంగా సర్కారు బడుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు, ఎంఈవోలు, డీసీఈబీ కార్యదర్శులు, క్వాలిటీ కో ఆర్డినేటర్లు, మండల నోడల్ అధికారులు, క్లస్టర్ నోడల్ అధికారులు బడుల్లో తనిఖీలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. వారంలో రెండు రోజులు.. 4 నుంచి 5 బడుల్లో తనిఖీలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన జాబ్చార్ట్ను విడుదల చేశారు. అయితే ఈ తనిఖీలపై టీచర్లు పెదవి విరుస్తున్నారు. గతంలో నిర్వహించిన తనిఖీలపై ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. నెల నెల నిర్వహించిన పరీక్షల ఫలితాలను సమీక్షించలేదు. అలాంటప్పుడు తనిఖీలు నిర్వహించి ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) రెండో సంవత్సరం థియరీ పరీక్షలను 18 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారి హాల్టికెట్లను www.bse. telangana.gov. in వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు.