హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థులు నాలుగేండ్ల ట్యూషన్ ఫీజు చెల్లించాలని పట్టుబట్టకుండా వారి సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ట్యూషన్ ఫీజు చెల్లించలేదని చెప్పి సర్టిఫికెట్లను ఇవ్వడం లేదంటూ విద్యార్థి నమిలె సంజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం ఈ ఉత్తర్వులను జారీచేశారు.
పిటిషనర్ నుంచి కళాశాల తీసుకున్న 10వ తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్‌ను ఇవ్వడం లేదని అతని తరఫు న్యాయవాది మహ్మద్ఫయాజ్ చెప్పారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఫీజులు డిమాండ్ చేయకుండా పిటిషనర్ సర్టిఫికెట్లను జారీచేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. విద్యార్థుల సర్టిఫికెట్లను నిలుపుదల చేయడం సరికాదని, వెంటనే సర్టిఫికెట్లను పిటిషనర్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.