మంచిర్యాల, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలో నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ కోసం 2013 భూసేకరణ చట్టం ప్రకారమే రైతులనుంచి భూములను సేకరించాలని హైకోర్టు ఆదేశించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకోవాలని సూచించింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి, పోచంపాడ్ గ్రామాల్లో 276.09 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములు ఇవ్వాలంటూ కొందరు రాజకీయ నాయకులు రైతులను బెదిరించి, బలవంతంగా తెల్లకాగితాలపై సంతకాలు చేయిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బాధితులను బెదిరించిన తీరుపై వార్తా కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. దీనిపై రైతులు గజ్జెల్లి లక్ష్మి, అనసూయ, దొమ్మాటి అర్జున్, మాడుగుల లింగయ్య ఇటీవల హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పూర్తి చట్టబద్ధంగా భూసేకరణ చేపట్టాలని, భూ యజమానుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ప్రజాప్రయోజనాల కోసం భూ సేకరణ చేయాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టం, సెక్షన్ 11 ప్రకారం నోటిఫికేషన్ జారీచేసి బాధిత రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని ప్రతివాదులుగా ఉన్న కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికైనా అధికారులు 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి నోటిఫికేషన్ జారీ చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.