హైదరాబాద్, నవంబర్ 13, (నమస్తే తెలంగాణ) : జీవోలు, ఆర్డినెన్స్‌లు తెలుగులో ఎందుకు ఇవ్వడం లేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవోలు, ఆర్డినెన్స్‌లను తెలుగులో జారీ చేయకపోవడం అధికార భాషల చట్టం-1956తో పాటు పలు జీవోలకు విరుద్ధమని శేరిలింగంపల్లికి చెందిన జీ ఉమామహేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇంగ్లీషులోనే ఉంటున్నాయన్నారు. సామాన్య ప్రజలకు ఏమీ తెలియక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవాళ్లు 70 శాతం ఉన్నారని, మిగిలిన 30 శాతం మందికి కూడా పూర్తిగా ఇంగ్లిష్ రాదన్నారు. జీవోలు తెలుగులోనే ఉండాలంటూ 1980లో వెలువడిన జీవోను ఇప్పుడు సవాల్ చేయడం ఏమిటని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. గత 30 ఏండ్లుగా ఇంగ్లిష్‌లో వెలువడే జీవోల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నట్టు పిల్లో లేదని చెప్పింది. పిటిషనర్ వయసు 72 ఏళ్లని, ఈ వయసులో ప్రచారం కోసం పిల్స్ వేయరాదని వ్యాఖ్యానించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించే అంశంపై ప్రభుత్వ వివరణ కోసం నోటీసులు జారీ చేసింది.