హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకుల పంపిణీలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెకులను పంపిణీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లబ్ధిదారులకు చెకులు సిద్ధమైనా పంపిణీ చేయడానికి రెవెన్యూ అధికారులు అనుమతించడంలేదని తెలిపారు. ఈ నెల 27లోగా చెకులను బ్యాంకుల్లో జమచేయని పక్షంలో అవి చెల్లవని చెప్పారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ లబ్ధిదారులు అర్హులైన పక్షంలో చెకుల గడువు తీరినా తాజాగా జారీ చేస్తామని హామీ ఇచ్చారు. చెకుల అందజేతలో జాప్యంపై వివరాలు చెప్పాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
బస్‌పాస్ కౌంటర్లలోనే జర్నలిస్టులకు పాస్‌లు జారీ
రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పొడిగించింది. ప్రస్తుత బస్‌పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ ద్వారా బస్‌పాస్‌లను జారీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ భావించింది. సాంకేతిక కారణాల వల్ల ఆన్లైన్ ద్వారా స్వీకరించడం లేదని తెలిపింది. బుధవారం నుంచి బస్‌పాస్ సెంటర్లలో అక్రిడిటేష్న్ కార్డు, పాత బస్‌పాస్ చూపించి, కొత్త పాస్‌లను తీసుకోవాలని ఆర్టీసీ సూచించింది.