యాచారం, సెప్టెంబర్ 18: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్‌నగర్‌కు చెందిన కొంతమంది రైతులకు బుధవారం హైకోర్టు నోటీసులు అందజేసింది. ఫార్మాసిటీకి భూములు ఎందుకు ఇవ్వడం లేదని, పరిహారం ఎందుకు తీసుకోవడం లేదని, అసలు తమ అభ్యంతరం ఏమిటో వెంటనే తెలియజేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నది. ఈ నెల 27న వ్యక్తిగతంగా కాని, న్యాయవాదితో గాని హైకోర్టులో రైతులు తమ వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టంచేసింది. దీంతో రైతులు ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మూడు రోజుల క్రితం మేడిపల్లికి చెందిన 72 మంది రైతులకు కోర్టు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా నానక్‌నగర్‌కు చెందిన రైతులకు నోటీసులు జారీ చేయడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులందరూ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు.
ఏదేమైనా ఫార్మాసిటీకి భూములిచ్చేది లేదని స్పష్టంచేశారు. కోర్టు నుంచి నోటీసులు రావడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఫార్మా గ్రామాలలో పర్యటించి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాను రద్దు చేస్తామని, రైతుల భూములు రైతులకే ఉంటాయని ప్రగల్భాలు పలికి.. నేడు గద్దెనెక్కి రైతులను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీ గ్రామాలైన మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్టు తెలిపారు.
ఫార్మాసిటీకి మొత్తం 19,333 ఎకరాల భూసేకరణలో మండలంలో 9,851 ఎకరాలకు గానూ 7,640 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమిని సేకరించిన విషయం తెలిసిందే. మొదట్లో అసైన్డ్ భూమి ఎకరాకు రూ.7 లక్షలు, పట్టాకు రూ.12.5 లక్షలు ఇచ్చి, తరువాత రైతుల డిమాండ్ మేరకు అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.7.70 లక్షలు, పట్టాకు రూ.16 లక్షల పరిహారం అందజేశారు. కొంత మంది భూములిచ్చి పరిహారం తీసుకోగా.. మరికొంత మంది భూములిచ్చేదిలేదని పరిహారం తీసుకోలేదు. రైతులు తమ అభిప్రాయం చెప్పాలని హైకోర్టు పిలుపునివ్వడంతో మరోసారి కోర్టుకు వెళ్లనున్నట్టు అన్నదాతలు తెలిపారు.