హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : అక్రమ నిర్మాణాలను నోటీసులివ్వకుండా తొలగించరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చెరువులు, రోడ్లు, వీధులు, పుట్‌పాత్‌లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో నిర్మించిన వాటికి వర్తించవని హైకోర్టు తేల్చి చెప్పింది. నదులకు, రైల్వేలైన్లకు అడ్డంగా చేపట్టిన నిర్మాణాలకు కూడా వర్తించదని తెలిపింది. ప్రజోపయోగ ప్రదేశాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించాల్సిందేనని స్పష్టంచేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ కొత్తచెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించి, నిర్మాణదారులకు నోటీసులు జారీచేయాలని అధికారులను ఆదేశించింది. నోటీసులకు వారి నుంచి వివరణ తీసుకోవాలని, అవి ఆక్రమ నిర్మాణమని తేలితే చట్ట ప్రకారం తొలగింపు చర్యలు చేపట్టి చెరువును రక్షించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు, అక్రమ నిర్మాణ అభియోగాలను ఎదురొంటున్న సాహిని బిల్డర్స్‌కు, ఇతర ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.
ఖాజాగూడ సర్వే నం.5లోని 5.25 ఎకరాల్లో కొత్తచెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఈ ఏడాది సెప్టెంబరు 6, 10 తేదీల్లో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని ఆరోపిస్తూ ఆర్ రామకృష్ణ సహా ఆరుగురు వేసిన పిటిషన్లపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి బుధవారం విచారణ జరిపారు. భూముల పకనే కొత్తచెరువు ఉన్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. కొత్తచెరువు దక్షిణాన నానక్రామ్కుంట ఉన్నదన్నారు. బిల్డర్‌తో చేతులు కలిపిన నీటిపారుదలశాఖ తప్పుడు నివేదిక ఇచ్చిందని, అక్రమ నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా చేసిందని చెప్పారు. విలేజ్ మ్యాప్‌కు పొంతన కుదరడం లేదన్నారు. ప్రస్తుతం శిఖం భూముల్లో నిర్మాణాలను అనుమతిస్తే భూగర్భ జల మట్టం తగ్గిపోతుందని, ఆ తర్వాత సమీప ప్రాంతాల వాళ్లు ఇబ్బందులు పడతారని అన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. నీటిపారుదల, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులు, జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ, హైడ్రా, సాహినీ బిల్డర్స్ ఎల్ఎల్పీ బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, జ్ఞానేశ్వర్, దామర్ల రాఘవరావు, ఎం భరతేందర్రెడ్డికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.