హైదరాబాద్, జూలై 4, (నమస్తే తెలంగాణ): సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ట్యాంక్‌బండ్ పకనే ఉన్న సచివాలయం, బుద్ధభవన్, నెక్లెస్‌రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటికి ఎఫ్టీఎల్, బఫర్జోన్లను నిర్ధారించారా? అని నిలదీసింది. ఇదే తరహాలో కూల్చివేతలు జరుపుతూ పోతే హైదరాబాద్ మహానగరం సగం ఖాళీ అయిపోతుందని వ్యాఖ్యానించింది. సున్నం చెరువు ప్రాంతంలో నోటీసులివ్వకుండా హైడ్రా కూల్చివేతలు, అక్రమ బోర్ల పేరుతో తొలగింపు చర్యలు, కూల్చివేతలపై గుట్టల బేగంపేటలోని ఎస్ఐఈటీ మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ సదానందం, మరో ఏడుగురు సంయుక్తంగా దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విన్నది. ఈ సందర్భంగా సున్నం చెరువు వద్ద ఏకపక్షంగా కూల్చివేతలు జరపడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ‘హైడ్రా ఏమనుకుంటున్నది? చట్టాలకు అతీతమైన అధికారాలు హైడ్రాకు ఏమైనా ఉన్నాయా?’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏది అక్రమమో, ఏది సక్రమమో నిర్ధారించాలంటే ప్రభుత్వానికి ఒక విధానం ఉందని గుర్తు చేసింది. నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలు చేపట్టే అధికా రం హైడ్రాకు లేవని తేల్చి చెప్పింది. బాధితులకు నోటీసులు జారీ చేయాలని, వాళ్ల దగ్గరు న్న ఆధారాలను పరిశీలించాలని, సర్వే చే యాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం ఉన్నదని వెల్లడించి, బాధితులకు వివరించి చర్యలు తీసుకోవాలని నిబంధనలు చెప్తున్నాయన్నది. వీటిని తుంగలో తొకడమేమిటని మండిపడింది. చట్టాన్ని అమలుచేయాలని హైడ్రాకు పలుసార్లు ఆదేశించినా, హెచ్చరికలు జారీచేసినా వ్యవహారతీరులో మార్పులు లేకపోవడం శో చనీయమని వ్యాఖ్యానించింది. ఇకపై హైడ్రా తీరు మారకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇదే చివరి హెచ్చరిక అని ధర్మాసనం స్పష్టంచేసింది.
కూల్చివేతలకు ఓ విధానం
ఎఫ్టీఎల్ అక్రమ కట్టడాల కూల్చివేతలకు విధివిధానాలున్నాయని ధర్మాసనం పేర్కొన్నది. చెరువుల సరిహద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు నిర్ధారించకుండా కూల్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ‘విలేజ్ మ్యాప్ ఆధారంగా చెరువు హద్దులు తేల్చాలి. ఆపై బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ణయించాలి. ఆ తర్వాత నిర్మాణాలు అక్రమమని తేలితే, వాటిని కూల్చడానికి కూడా ఓ విధానం ఉన్నది. ముందుగా నోటీసు ఇవ్వాలి. ఆపై వివరణ, పత్రాలను పరిశీలించాలి, తర్వా త కూల్చివేతలు ఉండాలి. ఇవేమీ లేకుండా సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేయడం ఏమిటి? బాధితులకు నోటీసులు జారీ చేయకుండా, సర్వే నిర్వహించకుండా కూల్చివేతలు ఎలా చేస్తారు’ అని ప్రశ్నించింది. ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయకుండా కూల్చివేతలు చేయరాద ని గతంలో అనేకసార్లు చెప్పినా హైడ్రాకు లెకలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిం ది. సున్నం చెరువు వద్ద అక్రమ బోర్లు ఉన్నాయని, వాటి నీరు కలుషితమైందని, అయినా ఆ బోర్ల నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తున్నారని హైడ్రా చెప్పడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో అక్రమంగా బోర్లు ఎకడ వేయలేదో చూపాలని పేర్కొన్నది. హైడ్రా చెప్పినట్టు అవి అక్రమ బోర్లని రాత్రికిరాత్రి ఎలా నిర్ధారించారని ప్ర శ్నించింది. వాటి తొలగింపునకు భారీ యం త్రాలు ఎందుకు తీసుకువెళ్లారని ప్రశ్నించింది. హైదరాబాద్ సిటీ అంతటా బోర్లే ఉన్నాయని, అవన్నీ లీగల్‌గా అనుమతి తీసుకున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇరుపక్షాల వాదనలు ఇలా..
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎంవీ దుర్గాప్రసాద్ వాదిస్తూ.. నోటీసు జారీ చేయకుండానే హైడ్రా అధికారులు కూల్చివేత చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. దీనిపై హైడ్రా తరఫు న్యాయవాది పవన్‌కుమార్ స్పందిస్తూ..గతంలో హైకోర్టు జారీచేసిన యథాతథస్థితి ఉత్తర్వులను అడ్డంపెట్టుకుని ఆ భూముల్లోని కలుషితమైన నీటిని బోర్ల ద్వారా తోడి విక్రయిస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్యం దెబ్బతీసే విధంగా సున్నం చెరు వు పరిసరాల్లో నీరుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. సున్నం చెరువును పునరుద్ధరించకపోతే పకనున్న నివాసితుల ఇండ్లు ముంపునకు గురవుతాయని చెప్పారు. దీనిపై దుర్గాప్రసాద్ కల్పించుకొని, అధికారులు సర్వే నిర్వహించలేదని, పిటిషనర్లకు నోటీసులు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు.
వాదనలపై స్పందించిన న్యాయమూర్తి, వివాదాస్పద భూములపై తదుపరి చర్యలు తీసుకునే ముందు, పిటిషన ర్లు, బాధితులకు నోటీసులు జారీ చేయాలన్న ప్రాథమిక నిబంధనను అమలు చేయాలి కదా? అని హైడ్రాను ప్రశ్నించారు. యథాతథ స్థితి ఆదేశాలను కొనసాగిస్తున్నట్టు ప్రకటించా రు. అక్రమ బోర్లు, నీటిని రవాణా చేసే వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేయవచ్చునని చెప్పారు. గుట్టల బేగంపేటలోని భూములకు సంబంధించిన వివాదం శాశ్వతం పరిషారం కావాలంటే సర్వే చేయడం ఒకటే మార్గమని, సర్వే చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు కూల్చివేతలు చేపట్టకుండా యథాతథస్థితి ఉత్తర్వులు కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. గుట్టల బేగంపేటలోని సర్వే నెం 12, 13, అల్లాపూర్ సర్వే నెం 31కి సంబంధించి పిటిషనర్లు సమర్పించిన పత్రాలను హైడ్రా పరిశీలించిన తర్వాత వివాదం లేదని తేలితే, సున్నం చెరువు పునరుద్ధరణ పనులకు అనుమతి కోసం హైడ్రా హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని ఆదేశించింది.
తక్షణమే కూల్చివేతలు ఆపండి
సున్నం చెరువు వద్ద కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ధర్మాసనం మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. రెండు వారాలపాటు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. సున్నం చెరువు విస్తీర్ణం ఎంతో అధికారికంగా తేల్చేందుకు సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు పది రోజులు గడువు ఇస్తున్నట్టు తెలిపింది. బేగంపేటలోని సర్వే నెంబర్లు 12, 13, అల్లాపూర్ గ్రామంలోని సర్వే నెం. 31లోని భూముల్లో పిటిషనర్లకు నోటీసులు జారీ చేశాకే సర్వే చేయాలని స్పష్టం చేసింది. పది రోజుల్లోపు రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులతో సున్నం చెరువును సర్వే చేయాలని స్పస్టం చేసింది. అదే విధంగా సున్నం చెరువులోని బోర్లు అక్రమమో, సక్రమమో తేల్చాలని సూచించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.
ట్యాంక్‌బండ్ పకనే ఉన్న సచివాలయం, బుద్ధభవన్, నెక్లెస్‌రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటికి ఎఫ్టీఎల్, బఫర్జోన్లను నిర్ధారించారా? ఇదే తరహాలో హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టుకుంటూపోతే హైదరాబాద్ మహానగరం సగం ఖాళీ అయిపోతుంది. చట్టాలకు అతీతమైన అధికారాలు ఏమైనా హైడ్రాకు ఉన్నాయా? హైడ్రా ఏమనుకుంటున్నది?
సున్నం చెరువు సర్వే చేయకుండా, ఎఫ్టీఎల్ను అధికారికంగా తేల్చకుండా శిఖం భూమిలో నిర్మాణాలు ఉన్నాయని ఎలా తేల్చారు?. ఏది అక్రమమో, ఏది సక్రమమో నిర్ధారించాలంటే ప్రభుత్వానికి ఒక విధానం ఉంది.
ముందు అక్కడున్న వారికి నోటీసులు జారీచేసి, సర్వే చేసిన తర్వాత ఎఫ్టీఎల్ను నిర్ధారణ చేసుకోవాలి. ఆ తర్వాత అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలి. అప్పుడు కూడా ముందు ఆ భూమిలో ఉన్నవారికి నోటీసులు ఇవ్వాలి. ఇవేమీ లేకుండానే హైడ్రా కూల్చివేతలు జరపడం దుర్మార్గం.