హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా కొంతమంది మోసగాళ్లు, రెవెన్యూ అధికారులు, సబ్రిజిస్ట్రార్లతో కుమ్మక్కవుతున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. అసైన్డ్ భూములను భూమార్పిడి చేసి విక్రయిస్తున్నారని అభిప్రాయపడింది. అసైన్డ్ భూములని తెలియక అమాయకులు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 1977 అసైన్డ్ చట్ట నిబంధనల ప్రకారం ఏదైనా కారణంగా అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే నిజాయితీగా కొనుగోలు చేసిన వారికి నష్టం వాటిల్లుతున్నదని చెప్పింది. లేని భూములనూ విక్రయిస్తుంటారని ఆక్షేపించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అసైన్డ్ భూమి/లావణి పట్టా భూమి విక్రయంపై మూడు నెలల్లో విచారణ జరిపి అవకతవకలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
మొయినాబాద్‌లోని సర్వే నం. 178/23లో 0335 గుంటల లావణి పట్టా భూమిని తమ అంగీకారం లేకుండా మరొకరికి విక్రయించడంపై నాగమ్మ ఆమె ముగ్గురు కుమార్తెలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ, నాగమ్మ భర్త లక్ష్మయ్య తదతనంతరం అతనికి చెందిన అసైన్డ్ భూమిని నలుగురు కుమారులు మరో వ్యక్తికి 2021లో విక్రయించారని చెప్పారు. విక్రయించేముందు నాగమ్మ, ఆమె కుమార్తెల అంగీకారం తీసుకోలేదని చెప్పారు. ఆసైన్డ్ భూమి/లావణి పట్టా అన్న విషయాన్ని తొకి పెట్టి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసి విక్రయించారని తెలిపారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు.. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఫసలీ ప్రకారం ఆసైన్డ్ భూమిని వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని తేల్చి చెప్పింది.
ఆ షరతులను ఉల్లంఘించితే ఆసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చునని పేర్కొంది. చట్ట నిబంధనల ప్రకారం ఆసైన్డ్ భూములను రిజిస్టర్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు లేనేలేదని తేల్చిచెప్పింది. అసైన్డ్ చట్టంలోని సెక్షన్ 7 (2ఏ) ప్రకారం ఏ అధికారి అయినా 5(1),(2) కింద నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు నెలల సాధారణ జైలు రూ.10 వేలు జరిమానా విధించేందుకు చట్టంలో వీలుందని గుర్తుచేసింది. ప్రస్తుత కేసులో పిటిషనర్లు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాలని, వినతి పత్రం అందిన మూడు నెలల్లోగా కలెక్టర్ విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాలని తీర్పుచెప్పింది.