హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా బోగస్ ఓట్లు నమోదైన వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు దృష్టికి తెచ్చింది. బోగస్ ఓటర్లు, బయటి ప్రాంతాల వాళ్ల ఓట్లు ఓటర్ల లిస్ట్‌లో ఉన్నాయని బీఆర్ఎస్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, ఆ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థిని మాగంటి సునీతా గోపీనాథ్ గురువారం హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. ఏయే ప్రాంతాల్లో బోగస్ ఓట్లు ఉన్నాయో సమగ్ర అధ్యయన అంశాలను పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు హైకోర్టు దృష్టికి తెచ్చారు.
బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులు తమకు అందాయని, వాటి ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని బోగస్ ఓట్లపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హామీ ఇచ్చారు. ఈ హామీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం రికార్డుల్లో నమోదుచేసింది. ఈసీ హామీ నేపథ్యంలో ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేయాల్సిన అవసరం లేదని అంటూ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో తొలుత దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అధికారపార్టీకి కొమ్ముకాసే కొందరు అక్రమంగా ఓట్లను చేర్పించారని అన్నారు. ఈసీ జారీచేసిన ప్రెస్‌నోట్‌లో ఈ నెల 21 వరకు ఓటర్ల జాబితా సవరణ ఉంటుందని పేరొందని తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఈసీ అధికారులకు బోగస్ ఓట్ల నమోదు వ్యవహారంపై రెండు వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. బయటి ప్రాంతాలకు చెందినవారు 12 వేల మంది ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారని తెలిపారు. యూసుఫ్‌గూడ ప్రాంతంలోని ఒక చిన్న ఇంటిలో ఏకంగా 44 ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఒక మహిళకు నల్లగొండ జిల్లాలో, తిరిగి ఇకడ కూడా ఓటు ఉందని తెలిపారు.
ఆ మహిళ, ఆమె భర్త పేరు ఇతర వివరాలన్నీ ఒకటేనని చెప్పారు. ఈ తరహాలో 1,942 మందికి రెండు లేదా మూడు ఓట్లు ఉన్నాయని తెలిపారు. అధికారపార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించడమే బోగస్ ఓట్లకు కారణమని అన్నారు. తప్పుల తడకగా ఓటర్ల జాబితా సిద్ధమైందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఓటర్లు ఇచ్చే తీర్పు పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉండాలంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని అన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎలక్షన్ పిటిషన్ వరకు వేచి ఉండకూడదని తెలిపారు. ఎన్నికలకు ముందే కోర్టులు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ల తీర్పు ఉండేలా చేయాలని కోరారు.
ఇటీవల బీహార్ ఎన్నికల సందర్భంగా 65 లక్షల ఓటర్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లేకుండానే తుది నోటిఫికేషన్లో ఉండటంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నదని తెలిపారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్నామని ఈసీ హామీ ఇచ్చిందని అన్నారు. ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ, పిటిషనర్లు బోగస్ ఓట్ల వివరాలతో సమర్పించిన వినతిపత్రంపై చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించామన్నారు. కొంత సమయం ఇస్తే విచారణ జరిపి, వినతి పత్రాలను పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషన్ పై విచారణ ముగించింది.