హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఆస్తి అనేది ప్రాథమిక హకు కాకపోయినప్పటికీ అది మానవ హకేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరోగ్య హకు, జీవనోపాధి హకు మాదిరిగా ఆస్తిహకు కూడా మానవ హకేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేరొన్నదని జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల గుర్తుచేశారు. భూసేకరణ ప్రక్రియను అమలు చేసే అధికారులు సంబంధిత నిబంధనలను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్‌గూడలో సదానందం, ప్రతాపరెడ్డి అనే రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వారికి చెందిన 14 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి, ఏపీఐఐసీ ఎమ్మార్‌కు రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదని ప్రకటించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారం భూసేకరణ చేపట్టవచ్చని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
చట్టప్రకారమే భూసేకరణ చేయాలి
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు 18 కిలోమీటర్ల రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు అమలులో భాగంగా సికింద్రాబాద్ క్లబ్‌కు సంబంధించిన 22 ఎకరాల భూమిని సేకరించడంపై దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ భూసేకరణ ప్రక్రియలో చట్ట నిబంధనలను అనుసరించాలని, సికింద్రాబాద్ క్లబ్‌కు సంబంధించిన బంగాళాను కూడా సేకరించాల్సివస్తే ఆ క్లబ్‌కు నోటీసులు జారీచేసి అభ్యంతరాలను స్వీకరించాలని స్పష్టం చేసింది. కారిడార్ నిర్మాణం కోసం ఈ ఏడాది మార్చి 1న హెచ్ఎండీఏకి కేంద్రం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ హైకోర్టులో సికింద్రాబాద్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి సోమవారం విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనల తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ చట్టం ప్రకారం క్లబ్‌కు నోటీసులిచ్చి అభ్యంతరాలను స్వీకరించాకే భూమిని సేకరించాలని స్పష్టం చేశారు.