పాలకుర్తి/వరంగల్ లీగల్, జూన్ 25: పోతనామాత్యుడి జన్మస్థలమైన బమ్మెరలో ఏర్పాటుచేసిన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ దేశంలోనే రోల్‌మాడల్‌గా నిలుస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పొనుగోటి నవీన్‌రావు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం అనేక చట్టాలు ఉన్నాయని, అవగాహన లేక రైతులు వాటిని ఉపయోగించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం మన రాష్ట్రంలోనే సుమారు 200 చట్టాలు రూపొందించారని గుర్తుచేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో నెలకొల్పిన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. తొలుత పోతన సమాధిని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోతన గ్రంథాలు, రచనలను గుర్తు చేసుకొని, ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన రైతు చట్టాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పోతన వ్యవసాయం నుంచి వచ్చిన వ్యక్తి అని, అందుకే పోతన జన్మించిన బమ్మెర నుంచి అగ్రి క్లినిక్ కేంద్రాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. డబ్బులు లేక న్యాయ సహాయం పొందలేకపోతున్న వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకే సంస్థను స్థాపించినట్టు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 70 అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఏర్పాటుచేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు ప్రారంభించామని వివరించారు.
రైతులు కూడా వినియోగదారులేనని, రైతు వ్యవసాయంలో నష్టపోతే పరిహారం కోసం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి న్యాయం పొందవచ్చని సూచించారు. అందరికీ న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే న్యాయ సేవా సంస్థ ఏర్పాటైందని చెప్పారు. అనంతరం వరంగల్‌లోని జిల్లా న్యాయ సేవా సంస్థ భవనంలో ఏర్పాటుచేసిన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఆయన ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో నల్సార్ వర్సిటీ వీసీ శ్రీకృష్ణ దేవరాయ, రాష్ట్ర న్యాయ సేవా సంస్థ కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, లీఫ్ సంస్థ అధ్యక్షుడు ఎం సునీల్‌కుమార్, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు రాధాదేవి, కృష్ణమూర్తి, రెండు జిల్లాల న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు ఆనందమోహన్, శ్యాంసుందర్‌రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ శ్యాంసుందర్‌రావు, న్యాయ సేవా సంస్థ కార్యదర్శులు ఉపేందర్‌రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.