హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఐడీపీఎల్‌కు కేటాయించిన 891.38 ఎకరాల భూమి స్వాధీన వ్యవహారంపై హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ భూముల స్వాధీనానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖ లు చేయాలని ఆదేశించింది. మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాలానగర్ పరిధిలోని ఐడీపీఎల్ భూముల స్వాధీనానికి సంబంధించి 2008లో రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఐడీపీఎల్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ సోమవారం విచారణ చేపట్టారు.
ఐడీపీఎల్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. 1994 ఫిబ్రవరి 8న నమోదైన కన్వేయన్స్ డీడ్ ద్వారా ఐడీపీఎల్‌కు భూమిని బదలాయించినట్టు తెలిపారు. దీంతో ఆ భూమిపై పూర్తి హకులు ఐడీపీఎల్కే ఉన్నాయని, ఆ భూమిని స్వాధీనం చేసుకొనే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ భూమిలో కొంత భాగాన్ని నైపర్‌కు బదిలీ చేసిన విషయాన్ని ప్రస్తావి స్తూ.. అది ఐడీపీఎల్ హకులకు అధికారిక గుర్తింపుగా నిలుస్తుందని పేరొన్నారు. దీనిపై అడ్వ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు.
పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని ఇతరులకు లీజుకు ఇవ్వడంతో ప్రభుత్వం స్వాధీన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. దీంతో ఐడీపీఎల్ భూమి స్వాధీన వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్‌తోపాటు కూకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్ తహసీల్దార్లు, టీజీఐఐసీ అధికారులకు నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను జూలై 13కు వాయిదా వేశారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన స్వాధీన ఉత్తర్వులను నిలిపివేస్తూ 2008 ఫిబ్రవరి 6న బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ (బీఐఎఫ్ ఆర్) 2008 ఫిబ్రవరి 6న జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం కూడా ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ కేసులో బీఐఎఫ్ఆర్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో ఐడీపీఎల్ అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఎదుట విచారణ పూర్తయ్యే వరకు భూమి స్వాధీనానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.