హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి గెలుపొంది అధికార కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు ఎదురొంటు న్న తొమ్మిదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించిన స్పీకర్ తీర్పును సవా ల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేస్తూ.. తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. నోటీసులు అందుకు న్న వారిలో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్ ఉన్నారు. వీరంతా మే 6వ తేదీలోగా తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఆ తర్వాత మూడు వారాల్లోగా పిటిషనర్లు కౌంట ర్లు దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించలేదంటూ.. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, పల్లె రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషనర్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం పది పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
బీఆర్ఎస్ పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ, బీఆర్ఎస్ నుంచి బీ ఫాం తీసుకొని ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు బాహాటంగా పార్టీ ఫిరాయించారని చెప్పారు. సీఎం, పీసీసీ చీఫ్‌ల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలను కప్పుకొన్నారని తెలిపారు. వారు పార్టీ ఫిరాయించినట్టు అనేక ఆధారాలను ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలోని స్పీకర్‌కు అందజేసినప్పటికీ వాటిని పట్టించుకోలేదని చెప్పారు.
ఫిరాయింపుదారు ల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పార్లమెంట్‌కు పోటీ చేశారని తెలిపారు. దీనిని శాసనసభ బయ ట జరిగిన వ్యవహారంగా స్పీకర్ తేల్చడం అన్యాయమని, రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తెకు కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ సీటు సంపాదిం చి, ఆమె పక్షాన బహిరంగంగా ఎన్నికల ప్రచా రం చేశారని తెలిపారు. మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్టు ఎన్నో ఆధారాలు, సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ ముందు పెట్టినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని తెలిపా రు. స్పీకర్ వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరారు. కాలయాపన చేస్తూ ఐదేండ్ల ఎమ్మెల్యేల పదవీ కాలం ముగిసే పరిస్థితులు ఏర్పడకుండా సత్వరమే స్పందించాలని కోరారు.