TG High Court | సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సిగాచీ పరిశ్రమ ప్రమాదంపై పిల్ దాఖలు చేసిన కే బాబు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేకపోవడంతో పేలుడు కారణమని పిటిషనర్ ఆరోపించారు. పేలుడు కారణంగా చనిపోయిన వారిలో ఇంకా ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదని ధర్మాసనానికి పిటిషన్ తెలిపారు. బాధితులకు పరిహారం ప్రకటించినా ఇంకా చెల్లించలేదని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. సిగాచీ పరిశ్రమ యజమానిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని, ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బయటపెట్టాలన్న న్యాయవాది కోర్టును కోరారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని పాశమైలారం వద్ద ఉన్న సిగాచీ ఫ్యాక్టరీలో గత నెల 30న ఉదయం సమయంలో పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో 143 మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారు. ఇందులో 61 మంది కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో 40 మంది కార్మికులు మరణించినట్లుగా కంపెనీ ప్రకటించింది. ఎనిమిది మంది మృతదేహాలు ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. ప్రమాదంలో 30 మందికిపైగా కార్మికులు గాయపడ్డట్లుగా కంపెనీ తెలిపింది. మృతుల కుటుంబాలకు కంపెనీ రూ.కోటి పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. గాయపడ్డ కార్మికులకు వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి పరిహారం విషయంలో స్పష్టత లేదంటూ పిటిషనర్ తెలిపారు. పేలుడు ఘటనపై కేసు విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆయన పిటిషనర్‌ను కోరారు.