హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇటీవల అమల్లోకి వచ్చిన మద్యం పాలసీపై దాఖలైన కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మద్యం పాలసీకి వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొంది. మద్యం దుకాణాలకు వాపసు లేని ఫీజు నిర్ణయించినప్పుడు దరఖాస్తు చేయకుండా ఉంటే సరిపోతుందని అభిప్రాయపడింది. 2025-27కు సంబంధించి మద్యం పాలసీని రాష్ట్ర సరార్ గత ఆగస్టు 14న జారీచేసింది.
ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన గడ్డం అనిల్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ సోమవారం విచారించారు. తిరిగి చెల్లించని విధానంలో ఫీజును రూ.3 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందని, నామమాత్రపు ఫీజు, ఈఎండీలు నిర్ణయించాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. పిటిషనర్‌కు గతంలో మద్యం షాపు లైసెన్స్ ఉందని, 2023-25లో లైసెన్స్ రాకపోవడంతో డిపాజిట్ సొమ్ము రూ.3 లక్షలు ప్రభుత్వం జప్తు చేసిందని తెలిపారు. ఎక్సైజ్ శాఖకు, కమిషనర్లకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణను నవంబరు 3వ తేదీకి వాయిదా వేసింది.