హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు వ్యక్తులతో తలెత్తిన ఓ భూవివాదంలో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం తీరుబడిగా అప్పీల్ దాఖలు చేయడమే కాకుండా చట్టసభల ఎన్నికల వల్ల కౌంటర్ దాఖలులో జాప్యం జరిగిందని సాకులు చెప్పడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఎన్నికల వల్ల ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేశామని చెప్పడానికి మీరేమైనా రాజకీయ నాయకులా? అని అధికారులను ప్రశ్నించింది. ఎన్నికలు రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారమని పేర్కొంటూ.. ఈ అప్పీలు దాఖలు చేసిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేశారని నిలదీసింది. హైదరాబాద్ గుడిమలాపూర్లోని 2,302 చదరపు గజాల స్థలానికి సంబంధించిన వివాదంపై 2016లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం తరపున కలెక్టర్ ఈ ఏడాది జూలైలో అప్పీలు దాఖలు చేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం పై ప్రశ్నలను సంధించింది. 2023లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున అప్పీలు దాఖలు చేయలేకపోయామని సాకులు చెప్పడం సరికాదని స్పష్టం చేసింది. అనంతరం ఈ అప్పీలు దాఖలులో జాప్యానికి దారితీసిన కారణాలను తెలియజేస్తూ సవివరమైన అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పడంతో అందుకు అనుమతించిన హైకోర్టు.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.