Durgam Cheruvu | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దుర్గంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాల కూల్చివేతల విషయంలో కఠిన చర్యలు చేపట్టబోమని లేక్‌ప్రొటెక్షన్ కమిటీ హామీ ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని, అప్పటివరకు కూల్చివేతలు ఉండబోవని వెల్లడించింది. పిటిషనర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఎఫ్టీఎల్ను నిర్ధారించాలని, ఆరు వారాల్లో నిర్ణయం వెలువరించాలని హైకోర్టు లేక్ ్ర పొటెక్షన్ కమిటీని ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేస్తామని అప్పటివరకు దుర్గంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాల కూల్చివేత ఉండబోదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దుర్గంచెరువు పరిధిలోని అమర్ సొసైటీలోనే నివాసముంటున్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట గ్రామం సర్వే నంబర్ 47లో దుర్గంచెరువు ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా కూల్చివేత నోటీసులు ఇచ్చారంటూ అమర్ సొసైటీ ప్లాట్ ఓనర్ల అసోసియేషన్ మరో ఇద్దరు వేర్వేరుగా వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ అవినాష్, న్యాయవాది పిరాయ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నీటిపారుదల శాఖలోని చెరువుల మ్యాప్ ప్రకారం దుర్గంచెరువు విస్తీర్ణం 65 ఎకరాలు మాత్రమేనని, అయితే 160ఎకరాలని అధికారులు చెప్పడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. బిల్డింగ్ రూల్స్ 2012లో వచ్చాయని, అప్పటికే హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా అనుమతులతో నిర్మాణాలు జరిగాయని, ఇప్పుడు వాటిని అక్రమ నిర్మాణాలని చెప్పి కూల్చివేత చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు.
హెచ్ఎండీఏ అనుమతులతో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామనడం సరికాదని అన్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారణకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ 2014 జూన్ 7న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేస్తే ..అదే నెల 14న అభ్యంతరాలు చెప్పామని తెలిపారు. తుది నోటిఫికేషన్ కూడా వెలువడలేదని అన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పీ శ్రీధర్‌రెడ్డి వాదిస్తూ.. ఒక ప్రజాహిత వ్యాజ్యంలో ఇదే హైకోర్టు చెరువుల ఎఫ్టీఎల్స్ నిర్ధారణ చేయాలని ఆదేశించిందని, హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కూల్చివేత చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎఫ్టీఎల్స్ను మూడు నెలల్లో నిర్ధారించాలని ఇదే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు.. లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సమర్పించిన అభ్యంతరాలను అక్టోబర్ 4లోగా అందజేయాలని పిటిషనర్లను ఆదేశించింది. అభ్యంతరాలు పరిశీలించి ఆరు వారాల్లోగా ఎఫ్‌టీఎల్‌పై నిర్ణయాన్ని వెలువరించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఆదేశించింది. ఈలోగా కూల్చివేత చర్యలు తీసుకోరాదని కమిటీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన హామీని కోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. పిటిషన్లపై విచారణను మూసేసింది.