హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు గతంలో కేటాయించిన బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఆయనకు భద్రతను తొలగించడాన్ని తప్పుపట్టింది. భద్రత తొలగింపు అన్యాయమని, తనకు బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రవీణ్‌కుమార్ గత నెల 23న సమర్పించిన వినతిపత్రంపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అప్పటివరకు ఆర్ఎస్పీ భద్రతలో ఎలాంటి మార్పులు చేయవద్దని ఆదేశించింది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ టీ మాధవీదేవి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యా యవాది మహేశ్‌రాజే వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ముప్పు ఉందని భావించిన వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న బెదిరింపులు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో గత పరిస్థితులను ప్రామాణికంగా తీసుకోబోమని అన్నారు.
క్రమం తప్పకుండా నిర్వహించే భద్రత సమీక్ష ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. జూన్ ఒకటిన సమావేశమైన భద్రత సమీక్ష కమిటీ మొత్తం 588 మంది భద్రతను పరిశీలించిందని, అందులో 380మంది రాజకీయ నాయకులు, 54 మంది విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, 75 మంది ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు, 54మంది ఇతరులు ఉన్నారని వివరించారు. రాజకీయ నాయకుల్లో 45 మందికి భద్రత ఉపసంహరించగా, మరో 20 మందికి తగ్గించామని, కొత్తగా వచ్చిన 29 దరఖాస్తులను పరిశీలించినప్పటికీ భద్రతకు సిఫార్సు చేయలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నక్సలిజం ప్రభావం లేదని, ఈ ఏడాది 264 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో మాజీ పోలీసు అధికారుల భద్రతను కూడా పునఃసమీక్షించి 25మందికి ఉపసంహరించాలని సమీక్ష కమిటీ సిఫార్సు చేసిందని వివరించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ప్రవీణ్‌కుమార్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా ఏకపక్షంగా ఆయన భద్రత తొలగించారని చెప్పారు. వాదనలపై స్పందించిన హైకోర్టు, పిటిషనర్‌కు ముందస్తు నోటీసు ఇ వ్వకుండా బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించడం సముచితం కాదని అభిప్రాయపడింది. ప్రవీణ్‌కుమార్ వినతిపత్రాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అప్పటివరకు ఆయనకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని కొనసాగించాలని ఆదేశించింది.