హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181 సర్వే నంబర్లో 103.35 ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయడాన్ని తప్పుపడుతూ మహమ్మద్ ఫరూజ్ అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో సింగిల్ జడ్జి విచారణ జరిపి, సివిల్ కోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసి, పిటిషన్‌ను కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ ఫరూజ్ అలీఖాన్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యా యవాది వాదిస్తూ.. రిజిస్ట్రేషన్ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. అనంతరం ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.