హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో 30 ఏండ్ల నుంచి పనిచేస్తున్న స్వీపర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వీసు క్రమబద్ధీకరించాలని కోరుతూ వారు సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని తప్పుపట్టింది. గతంలో హైకోర్టు వెలువరించిన తీర్పులను, సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆక్షేపించింది. స్వీపర్లు విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసును లెకించి, వారికి వేతన ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లు చెల్లించాలని తాజా తీర్పులో స్పష్టం చేసింది. గత 30 ఏండ్ల నుంచి స్వీపర్లుగా చేస్తున్న తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయలేదంటూ ఎన్ అశోక్ సహా దాదాపు 40 మంది దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సూరేపల్లి నంద ఈ తీర్పు వెలువరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) కార్యదర్శి పోస్టు మ్యూజికల్ చైర్‌ను తలపిస్తున్నది. అలా రాగానే.. ఇలా సర్కారు బదిలీ చేస్తున్నది. పూర్తిగా కుదురుకోకముందే కార్యదర్శులను బదిలీచేస్తున్నది. రెండేండ్ల కాలంలో నలుగురు కార్యదర్శులు మారారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడే నాటికి అనితారామచంద్రన్ టీజీపీఎస్సీ సెక్రటరీగా ఉండేవారు. ఆమెను బదిలీచేసిన సర్కారు.. 2024 ఫిబ్రవరి 5న నవీన్ నికోలస్‌ను కొత్త కార్యదర్శిగా నియమించింది. 2025 జూన్ 12న ఆయన స్థానంలో ప్రియాంక ఆలకు పోస్టింగ్ ఇచ్చిం ది. తాజాగా గురువారం ఎం హరితకు కమిషన్ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. ఇలా తరచూ కార్యదర్శులను మార్చడంతో కోర్టుకేసులు, న్యాయ వివాదాల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని కమిషన్ ఉద్యోగులు అంటున్నారు. టీజీపీఎస్సీలో సభ్యులు పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.