Bahadurguda Land Acquisition | హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బహదూర్‌గూడలో చేపడుతున్న భూసేకరణ వ్యవహారంలో హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 3, 5లోని రైతుల భూములకు సంబంధించి తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని, కంచెలు వేయడం, స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన జకిడి యాదిరెడ్డితోపాటు ముగ్గురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు బహదూర్‌గూడలోని సర్వే నంబర్లు 3, 5లో 28.6 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని, మూడు దశాబ్దాలుగా నిరంతర స్వాధీనంలో సాగు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పంటలు సాగులో ఉన్న సమయంలో హైడ్రా అధికారులు గేట్లు కూల్చివేసి కంచెలు ఏర్పాటుచేశారని, తమను భూముల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, దీంతో వ్యవసాయ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది వీ రఘునాథ్ కోర్టుకు తెలిపారు.
అధికారుల చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని, అధికార పరిధిని దాటి హైడ్రా జోక్యం చేసుకుంటోందని, రైతులను బలవంతంగా భూముల నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలను నిలువరించాలని కోర్టును కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ భూములు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న 650 ఎకరాల పరిధిలో భాగమని తెలిపారు.
పిటిషనర్లు తమ యాజమాన్యాన్ని నిరూపించే చెల్లుబాటయ్యే రిజిస్టర్డ్ సేల్ డీడ్లు, పహాణీలు, ఈ-పాస్ బుక్కులు, లింక్ డాక్యుమెంట్లు సమర్పించలేదని పేరొన్నారు. పిటిషనర్లు ప్రస్తావిస్తున్న సర్వే నంబర్లు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న భూముల సర్వే నంబర్లు వేరని, ప్రభుత్వ భూములనే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్నామని కోర్టుకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆటంకం కలుగుతుందని పేరొంటూ తాతాలిక ఉత్తర్వులు ఇవ్వద్దని కోరారు.
అయితే ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి తదుపరి విచారణ వరకు పిటిషనర్లు పేరొన్న భూముల విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని స్పష్టమైన మధ్యంతర ఆదేశాలిచ్చారు. ఇదే భూ వివాదానికి సంబంధించి బహదూర్‌గూడలోని వివిధ సర్వే నంబర్లలో భూములు కలిగిన మరో 85మంది రైతులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనున్నది.