BRS | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక రూ.12 వేలుగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండ క్లాక్‌టవర్ వద్ద ఈ నెల 28న చేపట్టనున్న ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అనుమతి సంబంధించి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ధర్నాలో 1500 మంది వరకు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థనను ఆమోదించింది. ధర్నా సందర్భంగా నేతల ప్రసంగం రెచ్చగొట్టేలా ఉండొద్దని సూచించింది. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే పోలీసులు జోక్యం చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 29కి వాయిదా వేశారు.
తొలుత ఈ నెల 21న చేపట్టిన ధర్నాకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అనుమతి నిరాకరించారు. దీనిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నల్లగొండ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున ఎం రూపేందర్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు శాంతియుత ధర్నాకు అనుమతి నిరాకరించడం అన్యాయమని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఈ నెల 20న లంచ్ మోషన్ పిటిషన్ వేశామని, గ్రామసభలు, రిపబ్లిక్ డే ఏర్పాట్ల పనుల్లో పోలీసులు బిజీగా ఉంటారని చెప్పి ప్రభుత్వం వాయిదా కోరిందన్నారు. భద్రత ఏర్పాట్లకు ఇబ్బందని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ఈ కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా పడినట్టు చెప్పారు. ఈ నెల 27న ధర్నాకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేస్తే అనుమతి ఇవ్వలేదని, తిరిగి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తితో 28న ధర్నాకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు.