హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): హైడ్రా బుల్డోజర్ న్యాయం అందిస్తామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఎత్తిచూపిన బుల్డోజర్ న్యాయం హైడ్రాకు వర్తించదా? అని నిలదీసింది. భూమి హకులను నిర్ధారణ చేయకుండా ఇష్టారీతిన భూములకు కంచె వేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిం ది. ఎందుకు కంచె వేశారంటే అది ప్రభు త్వ భూమి అని మాత్రమే హైడ్రా జవా బు చెప్తున్నది తప్ప అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపడం లేద ని తప్పుపట్టింది. ఆధారాలు లేకుండా కంచె వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పిం ది. కంచె వేసుంటే మాత్రం వాటిని తొలగించాల్సిందేనని ఆదేశించింది. అయినా, ఫలనా భూమి పారుదనో, ప్రభుత్వానిదనో హైడ్రా ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించింది.
జనం ఎంతో కష్టించి ఆర్జించిన డబ్బుతో కొన్న వాటిని నోటీసు ఇవ్వకుండా తమదేనని ఎలా నిర్ధారిస్తారని నిలదీసింది. మధ్యతరగతి ప్రజలు జీవితకాలం పొదుపుతో స్థలం కొనుగోలు చేస్తే అది ప్రభుత్వ స్థలమని, పారులకు కేటాయించామని ఎలా నిర్ణయానికి వస్తుందని హైడ్రాపై మండిపడింది. నిర్దిష్టంగా ఫలానా భూమి ప్రభుత్వానిదేనని కచ్చిమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే హైడ్రా జోక్యం చేసుకోవచ్చునని స్పష్టంచేసింది. హైదరాబాద్ గుడిమలాపూర్లోని 1351 చదరపు గజాల స్థలంలోని ఒక షెడ్‌ను కూల్చివేసి కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ వ్యాపారవేత్త ప్రసాద్ ఎన్ తంజెర్ల వేసిన వ్యా జ్యాన్ని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా హైడ్రా తీరుపై నిప్పులు చెరిగారు. హైడ్రా పై దాదాపు 400 పిటిషన్లు ఉన్నాయంటే ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో అర్థం అవుతున్నదని అన్నారు. తరచూ పిటిషన్లు దాఖలవుతున్నాయని చెప్పారు. తాము తీసుకున్న చర్యలపై నివేదిక అందజేస్తామని చెప్పడంతో విచారణ మార్చి 3కు వాయిదా పడింది.