హైదరాబాద్: హైడ్రా తీరుపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీచేయాలని నోటీసు ఇచ్చి 40 గంటల్లో ఎలా కూల్చుతారని ప్రశ్నించింది. చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారని హెచ్చరించింది. అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. కాగా, కోర్టుకు హాజరైన అమీన్పూర్ తహసీల్దార్ కూల్చివేతలపై వివరణ ఇచ్చారు. దీనిపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించారు.
సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముందన్నారు. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని స్పష్టం చేశారు. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. పైఅధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయొద్దన్నారు. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. చనిపోయే వ్యక్తిని కూడా చివరికోరిక అడుగుతారు కదా అని నిలదీశారు. పొలిటికల్ బాస్‌లను సంతృప్తి పరిచేందుకు పనిచేయొద్దన్నారు. ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని అధికారులను ప్రశ్నించారు. చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు న్యాయమూర్తి ప్రశ్నించారు. అమీన్పూర్పైనే మాట్లాడాలని, కావూరిహిల్స్ గురించి అడగలేదంటూ కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని.. జంప్ చేయొద్దని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామన్నా రంగనాథ్ వివరణపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మార్వో అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఎమ్మార్వో అడిగితే చార్మినార్, హైకోర్టును కూడా కూల్చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు ఇదే విధేంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందన్నారు. కూల్చివేతలు తప్ప వేరే పాలసి లేదని, ఇది ప్రజల అభిప్రాయమన్నారు. ఈ సందర్భంగా కోర్టులను ఎంతో గౌరవిస్తున్నామని న్యాయమూర్తికి రంగనాథ్ తెలిపారు. మూసీపై కూడా 20 లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని న్యాయమూర్తి వెల్లడించారు.
ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయం లేదని చెప్పారు. ఇది అరుదైన కేసుగా భావించే అధికారులను విచారణకు పిలిచామన్నారు. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్ చేయవచ్చు కదా అన్నారు. హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని, పనితీరే అభ్యంతరకమన్నారు. అమీన్పూర్ ఎమ్మార్వో, హైడ్రా కమిషనర్ తీరు అసంతృప్తికమరని చెప్పారు. ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా అక్రమాలు అని ఎలా తేలుస్తారన్నారు. సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తేనే సామాన్యులు ఇండ్లు నిర్మిస్తున్నారు. స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇండ్లు నిర్మించుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తున్నది. ఒక్కరోజులో హైదరాబాద్‌ను మార్చాలనుకోవడం సరికాదన్నారు.
ప్రభుత్వ జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయని, మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టిపెట్టారని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యపైనా హైడ్రాకు బాధ్యత ఉందన్నారు. ట్రాఫిక్ గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. మాదాపూర్‌లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కాదా అని ప్రశ్నించారు. నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి వస్తుందన్నారు. అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ 15కు వాయిదా వేశారు. అప్పటివరకు యథాతథస్థితి కొనసాగించాలని హైడ్రా, అమీన్పూర్ తహిసీల్దార్‌కు ఆదేశించారు. కౌంటర్లు దాఖలు చేయాలన్నారు.