హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది. కమిషన్ నివేదికను సవాలు చేస్తూ మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు , మాజీ మంత్రి టీ హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేసిన పిటిషనర్ల వ్యాజ్యంలో ప్రభుత్వం గడువు కోరడంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అప్పటివరకు ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదన్న మధ్యంతర ఉత్తర్వులును పొడిగించింది. తదుపరి విచారణకు వారం రోజుల ముందు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించింది.