(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం దుకాణాలు విచ్చలవిడిగా పెరుగుతుండటంపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. లిక్కర్ షాపులు, బార్లు-రెస్టారెంట్ల సంఖ్య ఇదే వేగంతో పెరుగుతూపోతే, తెలంగాణ రాష్ర్టానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడమేమిటని ఎక్సైజ్ అధికారులను సూటిగా ప్రశ్నించింది. ఈ మేరకు ఓ కేసు విషయమై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ఉన్నత ధర్మాసనం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని శ్రీ సత్యనారాయణ కాలనీలోని నివాస గృహాల మధ్యలో ఎస్ పవన్‌రెడ్డి అనే వ్యక్తి లిక్కర్షాప్ ఏర్పాటుకు అక్రమంగా కొన్ని షెడ్లు వేశాడు. ఇది రెసిడెన్షియల్ ఏరియా అని, ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆ పనులను అడ్డుకొన్నారు. తమ శాంతి-భద్రతలకు సమస్యలు సృష్టించేలా ఉన్న ఈ చర్యలను వెనక్కితీసుకోవాలని సూచించారు. ఇదే విషయమై నాగారం మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
జాగ్రత్తగా పర్మిషన్లు ఇవ్వాలి
పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. ఇదే వేగంతో లిక్కర్ షాపులు పెరిగితే, తెలంగాణ రాష్ర్టానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. మద్యం వినియోగం, దుకాణాల సంఖ్య తదితర పాలసీ విషయాల్లో తమ పాత్ర పరిమితమేనన్న ధర్మాసనం.. సొసైటీ సంక్షేమం కోసం వీలైనంత వరకూ తాము చేయగలిగింది చేస్తామని స్పష్టం చేసింది. ప్రధాన రహదారి నుంచి చూస్తే కనిపించని విధంగా మద్యం దుకాణాల ప్రకటన బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీనిపై ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు అవసరమైతే తాము మార్గదర్శకాలు జారీచేయాల్సి ఉంటుందని పేర్కొన్నది. జనావాసాలు ఉన్న చోట్ల మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చే సమయంలో అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, శాంతి-భద్రతలను దృష్టిలో పెట్టుకొని పర్మిషన్లు ఇవ్వాలని సూచించింది.
నానక్‌రామ్‌గూడలో ఇలా..
జనావాసాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా విధానపరమైన నిర్ణయాలను తీసుకొనిరావాలని కోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించింది. లిక్కర్ షాపుల ఏర్పాటు అంశంలో శాంతి-భద్రతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నది. నానక్‌రామ్‌గూడలోని ఓ మద్యం షాపు కేసులో తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. దాదాపు వెయ్యి కుటుంబాలు ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీ ముందే ఓ వ్యక్తి మద్యం దుకాణాన్ని ఏర్పాటుచేశారని ధర్మాసనం పేర్కొన్నది. మహిళలు, చిన్నారులు ఇబ్బందులుపడుతున్నా మద్యం దుకాణాన్ని వేరే చోటుకు మార్చే అంశాన్ని అధికారులు పట్టించుకోలేదని, దీంతో తామే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసింది. ఈ కేసులోనూ ఆ పరిస్థితి తీసుకురావద్దన్న ధర్మాసనం.. సంబంధిత ఎక్పైజ్, మున్సిపల్ శాఖ అధికారులతోపాటు మద్యం దుకాణ లైసెన్సు పొందిన సదరు వ్యక్తికి నోటీసులు జారీచేసింది. విచారణను వాయిదా వేసింది.