హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45-టీ జంక్షన్ నుంచి దుర్గంచెరువు వరకు రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన నాలుగు ప్రైవేట్ ఆస్తుల భూసేకరణ ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొనడం, అందుకు తగిన ఆధారాలు చూపకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తంచేసినా పరిగణనలోకి తీసుకోకుండా నోటీసు ఇవ్వడం సరికాదని, వీటన్నింటినీ తేల్చేదాకా పిటిషనర్లను ఖాళీ చేయించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 25న ఇచ్చిన నోటిఫికేషన్‌తోపాటు గతంలోజారీచేసిన నోటీసులను సవాలు చేస్తూ జూబ్లీహిల్స్‌కు చెందిన సీవీ నరసింహం మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. రోడ్డు నంబర్45 వద్ద ఉన్న 80 నుంచి 120 అడుగుల విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసిన విధానాన్ని తప్బుపట్టారు. చట్ట నిబంధనలను అనుసరించలేదని, భూసేకరణపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు స్పష్టంగా ఉన్నదని, వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే జనవరి 25న నోటీసు జారీచేయడాన్ని తప్పుబట్టారు. భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసే ముందు పునరావాస ప్రాంతాన్ని చూపాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశారు. చట్టప్రకారం భూసేకరణ జరిగిందో లేదా అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉందని, దీనికి సంబంధించిన అన్ని వివరాలతో సమగ్ర కౌంటరు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లకు చెందిన స్థలాలను స్వాధీనం చేసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
కోర్టుకు వస్తారా?కౌంటర్ దాఖలుచేస్తారా? ; రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ మార్చి 21 (నవంబర్ తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్‌లోని సర్వే నంబర్ 126లో ఆక్రమణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేస్తారా? లేక వ్యక్తిగతంగా హాజరవుతారా? అని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్ 9లోగా కౌంటర్ దాఖలు చేయని పక్షంలో వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని పేరొంది. ఇంజాపూర్‌లోని సర్వే నంబర్ 126లో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, రికార్డుల మార్పిడి, అక్రమ లేఔట్లు, అధికార దుర్వినియోగం, రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు జరిపించాలంటూ వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సరూర్‌నగర్‌కు చెందిన న్యాయవాది సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఏ సంతోష్‌కుమార్ వాదనలు వినిపిస్తూ వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని తెలిపారు. ఇందులో అధికారులు, నేతల జోక్యం ఉన్నదని, అందువల్ల స్వతంత్ర లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. వాదనలు విన్న జడ్జి గతంలో ఆదేశాలు జారీచేసినా కౌంటర్ దాఖలు చేయలేదని, మరోసారి గడువు ఇస్తున్నామని, వచ్చే విచారణ నాటికి కౌంటరు దాఖలు చేయాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.