హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వకం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల నుంచి భూమిని తీసుకుని 15 ఏండ్లయినా పరిహారం చెల్లించే తీరిక అధికారులకు లేదా అని మండిపడింది. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా రైతులకు పరిహారం చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీసింది. పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేయాలని నిరుడు సెప్టెంబర్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని, కోర్టు ఉత్తర్వులంటే లెకలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడం కోర్టు ధికరణ కిందికి వస్తుందని పేర్కొన్నది. కోర్టు ధికరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటూ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారా వు, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితోపాటు వనపర్తి భూసేకరణ అధికారి డీ సుబ్రమణ్యంకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆ నలుగురు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సీవీ భాసర్రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.