హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : కేసు విచారణను కోర్టు వాయిదా వేయడం తప్ప ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. పదేపదే వాయిదాలు కోరడంపై అసహనం వ్యక్తంచేసింది. ఊహించిన దానికంటే ఎకువ గడువు తీసుకుంటూ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆలస్యానికి కారణాలను తెలియజేయాలని నిలదీసింది. వికారాబాద్‌లో దామగుండం రిజర్వు అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై గురువారం మరోసారి విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు గడువు కావాలని కోరడంతో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చివరిసారిగా రెండు వారాల గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈసారి కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది. రాడార్ ప్రాజెక్ట్ కేంద్రానికి 2900 ఎకరాల దామగుండం అటవీ భూములను బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ హైకోర్టులో 2020లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఐదేండ్లు కావొస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయలేదని తీవ్రంగా ఆక్షేపించింది.
ప్రభుత్వానికి చెందిన విలువైన భూములకు సంబంధించిన అత్యంత కీలకమైన మరో కేసులో కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై మరో న్యాయమూర్తి మండిపడ్డారు. కౌంటర్లు దాఖలు చేయడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, మణికొండ జాగీర్ గ్రామంలోని సర్వే నం.78లో 1652 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం స్పందించలేదు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ గురువారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల రక్షణలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటే కోర్టుల్లో కేసుల సంఖ్య పెరిగి తీవ్ర భారమవుతుందని అన్నారు. కొద్దిసేపటికి అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హాజరై సమాచార లోపం వల్ల కేసు విచారణకు హాజరుకాలేకపోయినట్టు చెప్పారు. హైకోర్టు స్పందిస్తూ, వాయిదాలు కోరకుండా కౌంటర్లు దాఖలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తల్లి లేని పిల్లల సంక్షేమాన్ని గాలికి వదిలేసి బాధ్యతల నుంచి తప్పించుకున్న తండ్రికి మైనర్ పిల్లల విదేశీ ప్రయాణాన్ని అడ్డుకునే హకు, అధికారం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. తల్లి చనిపోయాక పిల్లలు తాత, అమ్మమ్మ సంరక్షణలో ఉండగా తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతోపాటు పిల్లల నిర్వహణ ఖర్చు కూడా చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో పిల్లలపై చట్టబద్ధమైన హకుల గురించి తండ్రికి అధికారం, హకు ఉండదని తేల్చి చెప్పింది. పిల్లలకు ప్రయాణం చేసే హకు రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేసింది. పిల్లలకు పాస్‌పోర్టు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. తమ సంరక్షణలో ఉన్న కూతురు పిల్లలకు తండ్రి అనుమతి లేకుండా పాస్‌పోర్టు జారీకి అధికారులు నిరాకరించడం అన్యాయమంటూ హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ తాజుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు చెప్పారు. పిల్లలు తాత, అమ్మమ్మ సంరక్షణలోనే ఉన్నారని, తండ్రి తన బాధ్యతలను నిర్వహించలేదని, కాబట్టి పిల్లల ప్రయాణాన్ని అడ్డుకోలేరని అన్నారు. తండ్రి సంతకం లేకపోయినప్పటికీ పిల్లలకు పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.