హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్‌కు (Group-1 Mains) అడ్డంకి తొలగిపోయింది. ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది కీలో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది. అయితే తీర్పును మంగళవారం వెలువరిస్తామని ప్రకటించింది.
గ్రూప్-1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకమైనది. వీటితోపాటు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన కేసు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి 503 పోస్టులు, కొత్త నోటిఫికేషన్లో అదనంగా చేర్చిన 60 పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై వేసిన కేసు, హైకోర్టు మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంపై పలువురు కేసులు వేశారు.
ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను టీజీపీఎస్సీ ఇప్పటికే పూర్తిచేసింది. సోమవారం హాల్‌టికెట్లను సైతం విడుదల చేసింది. పరీక్షకు ఒకరోజు ముందు అంటే ఈ నెల 21 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.